టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(118 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) మరోసారి ఆకట్టుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో విలువైన ఇన్నింగ్స్‌తో భారత విజయం కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్.. రెడ్ బాల్ క్రికెట్‌లో అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేసాడు. ఆటతోనే తాను ఎంత విలువైన ఆటగాడినో చాటి చెప్పాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఇండియా-డీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అక్షర్ పటేల్.. ఆపద్భాందవ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.అనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇండియా-సీ బౌలర్లు నిప్పులు చెరగడంతో ఇండియా డీ 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇండియా సీ బౌలర్ల ధాటికి ఇండియా డీ కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది.

కానీ క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అటాకింగ్ గేమ్‌తో ఇండియా సీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వరుసగా 6, 4, 6 హ్యాట్రిక్ బౌండరీలు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోయినా.. 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేసి జట్టుకు 164 పరుగుల స్కోర్ అందించాడు.
సెంచరీ దిశగా సాగిన అతని ఇన్నింగ్స్ మనవ్ సుతార్ స్టన్నింగ్ క్యాచ్‌తో తెరపడింది. హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ ఆడిన భారీ షాట్‌ను మనవ్ సుతార్ బౌండరీ లైన్‌పై అద్భుతంగా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. భారత టెస్ట్ టీమ్‌లో అక్షర్ పటేల్‌కు చోటు ఖాయమైందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. జట్టులోని బ్యాటర్లంతా ఇబ్బంది పడిన పిచ్‌పై అక్షర్ పటేల్ భారీ సిక్స్‌లు బాదడం అతని ప్రతిభకు నిదర్శనమని కొనియాడుతున్నారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా... పిచ్ బ్యాటింగ్‌కు ప్రతీకూలంగా ఉన్నా.. హాఫ్ సెంచరీ ముంగిట హ్యాట్రిక్ బౌండరీలు బాదడం అద్భుతమని ప్రశంసిస్తున్నారు. 'ఏం గుండెరా అది'అనే డైలాగ్స్‌తో మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
ఇండియా డీలో అక్షర్ పటేల్(83) మినహా అథర్వ టైడ్(4), యశ్ దుబే(10), శ్రేయస్ అయ్యర్(9), దేవదత్ పడిక్కల్(0), రికీ భుయ్(4), శ్రీకర్ భరత్(13), సరన్ష్ జైన్(13), హర్షిత్ రాణా(0), అర్ష్‌దీప్ సింగ్(13) దారుణంగా విఫలమయ్యారు. ఇండియా సీ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్(3/19) మూడు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్(2/47), హిమన్షఉ చౌహన్(2/22) రెండేసి వికెట్లు పడగొట్టారు. మానవ్ సుతార్, హృతిక్ షోకీన్ తలో వికెట్ తీసారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా సీ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(5), సాయి సుదర్శన్(7), ఆర్యన్ జుయల్(12) దారుణంగా విఫలమవ్వగా.. రజత్ పటీదార్(12 బ్యాటింగ్), బాబా ఇంద్రజిత్(2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టాడు.