తమ బ్యాటర్ల వైఫల్యంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన అక్షర్ పటేల్.. పవర్ ప్లేలో రాణించకపోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై తమ బ్యాటర్లు తేలిపోయారని చెప్పాడు.
'పవర్ ప్లేలో మేం సరిగ్గా లేదు. మా బ్యాటింగ్ కూడా సరిగ్గా లేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. మేం చాలా తేలిగ్గా వికెట్లు కోల్పోయాం. ఇలాంటి పిచ్‌లపై పవర్‌ప్లేలో మెరుగ్గా రాణించడం కీలకం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, బ్యాటింగ్ వైఫల్యం మా ఓటమిని శాసించింది. బౌలింగ్‌లోనూ 15-20 పరుగులు అదనంగా ఇచ్చాం. ఈ మ్యాచ్ సానుకూలాంశం ఏంటంటే.. పవర్ ప్లే తర్వాత కేకేఆర్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాం. బ్యాటింగ్‌లో ఇద్దరు ముగ్గురు బ్యాటర్లు రాణించి ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారేది. విప్రజ్ బ్యాటింగ్ చేసే సమయంలో గెలుస్తామనే ఆశలు కలిగాయి. అషుతోష్ శర్మ రాణించి ఉంటే.. మా తొలి మ్యాచ్ తరహా ఫలితం పునరావృతమయ్యేది.

ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నా వేలికి గాయమైంది. బంతిని ఆపే ప్రయత్నంలో ప్రాక్టీస్ పిచ్‌పై డైవ్ కొట్టడంతో చర్మం ఊడిపోయింది. బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్ హ్యాండిల్ ఆ ప్రదేశానికి తగలడంతో తీవ్ర నొప్పి వచ్చింది. మా తదుపరి మ్యాచ్‌కు 3-4 రోజుల విరామం ఉంది. ఆ మ్యాచ్‌లోపు కోలుకుంటానని ఆశిస్తున్నా.'అని అక్షర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), రింకూ సింగ్(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 36) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), అక్షర్ పటేల్(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) రాణించినా ఆ జట్టుకు ఆశించిన ఫలితం దక్కలేదు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. వరుణ్ చక్రవర్తీ(2/39) రెండు వికెట్లు తీయగా..అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా చెరో వికెట్ తీసారు.