టీమిండియా స్టార్ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం గురించి తన సోదరి చెప్పిందని స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తెలిపాడు. తెల్లవారుజామున తన సోదరి పంత్ రోడ్డు ప్రమాదం గురించి చెప్పగానే భయంతో వణికిపోయానని అక్షర్ పటేల్ గుర్తు చేసుకున్నాడు.
ఏడాది క్రితం రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కొత్త ఏడాది తమ కుటుంబ సభ్యులకు సర్‌ప్రైజ్ ఇద్దామని సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుంచి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ తన స్పోర్ట్స్ కారులో పంత్ బయల్దేరగా.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన పంత్ కారు.. టర్నింగ్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది.

దాంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. ఇతర వాహనదారులు పంత్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో గత ఏడాది పాటు పంత్ ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఆ గాయాల నుంచి కోలుకునేందుకు పంత్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నాడు. అప్‌కమింగ్ ఐపీఎల్ సీజన్‌లో పంత్ బరిలోకి దిగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన పంత్.. రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు.
ఇక రిషభ్ పంత్ ప్రమాదం నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓ ఎమోషనల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో పంత్ ప్రమాదం గురించి అక్షర్ పటేల్ గుర్తు చేసుకున్నాడు.
'ఆ రోజు ఉదయం ఏడు గంటల సమయంలో నాకు మా అక్క ఫోన్ చేసింది. రిషభ్ పంత్‌తో నువ్వు చివరిసారిగా ఎప్పుడూ మాట్లాడావు? అని ప్రశ్నించింది. ముందు రోజే మాట్లాడాలని ప్రయత్నించినా కుదరలేదని చెప్పాను. వెంటనే పంత్ అమ్మగారి ఫోన్ నంబర్ ఉంటే పంపించమని నన్ను అడిగింది. ఎందుకు అని అడిగితే.. రిషభ్ పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాను. ఆ మాట వినగానే నేను షాక్‌కు గురయ్యాను. భయంతో వణికిపోయాను.'అని అక్షర్ పటేల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
ఈ ప్రమాదం అనంతరం రిషభ్ పంత్ మొకాలికి సర్జరీ జరిగింది. అప్పటి నుంచి అతను క్రికెట్ ఆడేందుకు శ్రమిస్తున్నాడు. మునపటిలా కీపింగ్ చేయడంతో పాటు ధాటిగా ఆడగలుగుతాడా? అనేది సందేహంగా మారింది. ఐపీఎల్ 2024 వేలంలోనూ రిషభ్ పంత్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగాడు. రిషభ్ పంత్ ఫిట్‌నెస్‌కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.