టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అక్షర్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు విల్ జాక్స్(35) నిరాశగా పెవిలియన్ చేరాడు.
విల్ జాక్స్ ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్‌పై అద్భుతంగా అందుకున్న అక్షర్ పటేల్.. బంతిని చాకచక్యంగా తన సహచర ఫీల్డర్ అయిన శివమ్ దూబేకు అందజేశాడు. దాంతో సిక్సర్ కాస్త క్యాచ్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అక్షర్ పటేల్‌ను కొనియాడుతున్నారు.

అర్ష్‌దీప్ సింగ్ వేసిన 14వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతికి మూడు వైడ్స్ వేసిన అర్ష్‌దీప్ సింగ్.. నాలుగో ప్రయత్నంలో ఫుల్ టాస్ సంధించాడు. ఈ బంతిని విల్ జాక్స్ భారీ షాట్ ఆడగా.. డీప్ కవర్ నుంచి పరుగెత్తుకొచ్చిన అక్షర్ పటేల్.. బౌండరీ లైన్‌పై అద్భుతంగా అందుకున్నాడు.
సమన్వయం కోల్పోయిన అతను చాకచక్యంగా పక్కనే ఉన్న శివమ్ దూబేకు బంతిని అందించాడు. దాంతో విల్ జాక్స్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో ఐదో వికెట్‌కు నమోదైన 77 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అక్షర్ పటేల్ పట్టిన ఈ క్యాచ్ మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పింది. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ మొత్తం మూడు క్యాచ్‌లు అందుకున్నాడు.
చివర్లో బుమ్రా, హార్దిక్ పాండ్యా కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. . సంజూ శాంసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) మెరుపులు మెరిపించారు. చివర్లో తిలక్ వర్మ(7 బంతుల్లో 3 సిక్సర్లతో 21), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27)దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్(2/40), ఆదిల్ రషీద్(2/41) రెండేసి వికెట్లు తీయగా... జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు 19 సిక్సర్లు, 20 ఫోర్లు బాదారు.
అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. జాకోబ్ బెతెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 ) శతకంతో ఒంటరి పోరాటం చేయగా.. విల్ జాక్స్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/38) రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా(1/33), వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.