
రాజ్‌కోట్: సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో తాను కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శనను టీమిండియా పేసర్ ఆవేశ్ ఖాన్ తన తండ్రికి అంకితమిచ్చాడు. ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో వికెట్లేమీ తీయలేకపోయిన అతడు ఈ మ్యాచ్‌లో 4/18 మేటి ప్రదర్శన చేశాడు. దీంతో టీమిండియా 82 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన అవేశ్ తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందన్నాడు. తన తండ్రి పుట్టిన రోజే తాను సత్తా చాటడం గొప్పగా ఉందని చెప్పాడు.
'ఈ ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. మా నాన్న పుట్టినరోజు కూడా నేడే. నా అత్యుత్తమ ప్రదర్శనను ఆయనకు అంకితమిస్తున్నా. ఇక్కడ నేనేం ప్రణాళికలు రచించలేదు. సహజసిద్ధంగా బౌలింగ్ చేసి వికెట్లకేసి విసరాలనుకున్నా. ఈ పిచ్ వైవిధ్యంగా ఉంది. బంతి కొన్నిసార్లు బౌన్స్ అయ్యింది.. కొన్నిసార్లు కింద నుంచి వెళ్లింది. దీంతో కాస్తంత బౌన్స్ ప్రదర్శించి సరైన లెంగ్త్‌లో వేయాలనుకున్నా. అలాగే రిషభ్ పంత్ కూడా పరిస్థితులకు తగ్గట్టు ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు.
దాంతో జాన్సెన్, మహారాజ్‌ల వికెట్లు సాధించా. మరోవైపు జట్టుగా మేం బాగా ఆడుతున్నాం. ఫీల్డింగ్, బౌలింగ్ బాగా చేస్తున్నాం. దీంతో ఆఖరి మ్యాచ్‌ను కూడా ఆస్వాదించాలనుకుంటున్నాం. అక్కడ ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. మేం విజయం సాధించడానికి తప్పకుండా కృషి చేస్తాం' అని అవేశ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
మొదట టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దినేశ్ కార్తీక్ ( 27 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ టీ20ల్లో తొలి అర్ధశతకాన్ని అందుకున్నాడు. హార్దిక్ పాండ్య ( 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) బాదుడు కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఎంగిడి (2/20) రాణించాడు. ఈ మ్యాచ్‌తో జాన్సన్ (1/38) అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేశాడు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే పరిమితమైంది. అవేశ్ ఖాన్ (4/18) ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. చాహల్ (2/21) కూడా మెరిశాడు.