టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై ఆస్ట్రేలియా మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమను జడేజా అవమానించాడని తమ ఛానెల్స్ వేదికగా మండిపడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టెస్ట్‌లు ముగియగా.. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాయి. నాలుగో టెస్ట్ మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే మెల్‌బోర్న్ చేరుకున్న టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో రవీంద్ర జడేజా శనివారం మీడియాతో మాట్లాడాడు. బ్రిస్బేన్ టెస్ట్‌కు సంబంధించిన విషయాలను పంచుకున్నాడు.

ఈ మీడియా సమావేశంలో జడేజా భారత మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చాడు. హిందీలోనే మాట్లాడాడు. తమ ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇవ్వాలని, ఇంగ్లీష్ మాట్లాడాలని ఆసీస్ మీడియా కోరగా జడేజా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాధారణంగా జడేజా పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్స్‌లో హిందీలోనే మాట్లాడుతుంటాడు. ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడాడు. టీమిండియా మేనేజర్ కూడా మీడియా సమావేశానికి ముందు హిందీలో మాత్రమే మాట్లాడుతాడని స్పష్టం చేశాడు. కానీ ఆసీస్ మీడియా తమ ప్రశ్నలకు బదులివ్వాలని డిమాండ్ చేసింది. అయితే టీమ్ బస్ వెళ్లడానికి సిద్దంగా ఉందని, జడేజా మాట్లాడలేడని అతను చెబుతున్నా వినిపించుకోలేదు.
తాము చాలా సేపటి నుంచి వేచి చూస్తున్నామని, ఇలా చేయడం తమను అవమానించడమేనని మేనేజర్‌తో గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా భారత ఆటగాళ్లు ఆసీస్ మీడియా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తమ ఛానెల్స్‌లో ప్రత్యేక ప్రోగ్రామ్స్ రన్ చేసింది. విమానాశ్రయంలో విరాట్ కోహ్లీ మహిళ జర్నలిస్ట్‌తో వాగ్వాదానికి దిగాడని, తాజాగా జడేజా ఆసీస్ మీడియా ప్రతినిధులను అవమానించాడని మండిపడింది.
ఇక తన అనుమతి లేకుండా తమ పిల్లల ఫొటోలను తీసేందుకు ప్రయత్నించిన సదరు జర్నలిస్ట్‌తో కోహ్లీ గొడవపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను కూడా ఆసీస్ మీడియా వక్రీకరించింది. కోహ్లీ రాక కోసం సిద్దంగా ఉన్న మీడియాను చూసి పొరబడ్డాడని, తన పిల్లల ఫొటోలు వీడియో తీస్తున్నారని గొడవకు దిగాడని పేర్కొంది.