ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తాజాగా తాను మరో స్కిన్ క్యాన్సర్ సర్జరీ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. క్రమం తప్పకుండా అందరూ హెల్ట్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించాడు.
'ఆస్ట్రేలియాలో స్కిన్ క్యాన్సర్ సహజమే. నా ముక్కుపై మరో కోత పడింది. మీ చర్మానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. చికిత్స కంటే నివారణే ఉత్తమం. నా విషయంలో రెగ్యులర్ చెకప్‌లు, ముందస్తుగా గుర్తించడం చాలా కీలకంగా నిలిచాయి.'అని ఇన్‌స్టాలో పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు సారథ్యం వహించిన క్లార్క్.. 2004-2015 మధ్య 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. 74 టెస్ట్‌లు, 139 వన్డేల్లో సారథ్యం వహించాడు. అతని సారథ్యంలోనే 2013-14లో యాషెస్ సిరీస్‌ను ఆసీస్ నెగ్గింది. 2015 వన్డే వరల్డ్ కప్ కూడా కైవసం చేసుకుంది.

ఇక ఈ వ్యాధితో పోరాడటం క్లార్క్‌కు ఇదే తొలిసారి కాదు. 2006 నుంచి అతను డజన్‌కు పైగా క్యాన్సర్‌లకు చికిత్స తీసుకున్నాడు. ఆస్ట్రేలియాలో చర్మ క్యాన్సర్లు సహజం. అధిక యూవీ రేడియేషన్ స్థాయిలు, భూమధ్య రేఖకు సమీపంలో ఉండటం వంటి కారణాలతో ఇక్కడి వారిలో ఎక్కువగా స్కిన్ క్యాన్సర్లు బయటపడుతుంటాయి.