Six wickets in Six balls: క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదైంది. 6 బంతుల్లో 6 సిక్స్‌లు.. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు వంటి అసాధారణ రికార్డులు నమోదైన క్రికెట్‌లో.. అసాధ్యమైన 6 బంతుల్లో 6 వికెట్ల ఘనత కూడా సుసాధ్యమైంది. ఆస్ట్రేలియా క్లబ్ క్రికెట్‌లో ఎవరూ ఊహించని ఈ అరుదైన ఫీట్ నమోదైంది.
గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ క్రికెట్‌లో భాగంగా గత శనివారం ముద్గీరబా నెరంగ్, సర్ఫర్స్ ప్యారడైజ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్‌లో ముద్గీరబ నేరంగ్ కెప్టెన్ గారెత్ మోర్గాన్ 6 బంతుల్లో 6 వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 143 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే ఎవరూ అందుకోని ఈ ఘనతను సొంతం చేసుకొని చరిత్రకెక్కాడు.

ఈ అరుదైన ఫీట్ కూడా చివరి ఓవర్‌లో సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముద్గీరబ నేరంగ్ జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 177 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సర్ఫెర్స్ ప్యారడైజ్ జట్టు 39 ఓవర్లకు 4 వికెట్లకు కోల్పోయి 174 పరుగులు చేసింది.
చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 4 పరుగులు అవసరం కాగా.. చివరి ఓవర్‌కు బౌలింగ్‌కు దిగిన గారెత్ మోర్గాన్ వరుసగా 6 వికెట్లు తీసి ప్రపంచ రికార్డ్‌తో పాటు తమ జట్టుకు సంచలన విజయాన్నందించాడు. మోర్గాన్ దెబ్బకు ప్యారడైజ్ బ్యాటర్లలో ఐదుగురు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు.

ఈ ఆరుగురి బ్యాటర్లలో మొదటి నలుగురు క్యాచ్ ఔటవ్వగా.. మరో ఇద్దరూ క్లీన్ బౌల్డ్ అయ్యారు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఐదు వికెట్లు తీయడం ఇప్పటి వరకు రికార్డ్. న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్.. తమ దేశవాళీ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించాడు. 2011లో వెల్లింగ్టన్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసాడు.
భారత్‌కు చెందిన అభిమన్యూ మిథున్ సైతం ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసాడు. 2019 రంజీ క్రికెట్‌లో కర్ణాటక తరఫున ఆడిన అభిమన్యు మిథున్.. హర్యానాపై ఈ ఫీట్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం రికార్డ్. శ్రీలంక దిగ్గజ పేసర్ లసిత్ మలింగా ఈ ఫీట్ సాధించాడు.