ఆస్ట్రేలియాతో ఏకైక పింక్ బాల్(డే/నైట్) టెస్ట్‌లో భారత మహిళల జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పెర్త్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు కనీస పోటీ ఇవ్వలేకపోయింది.
25 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 4.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంతకుముందు 105/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు కుప్పకూలింది. ప్రతికా రావల్(137 బంతుల్లో 8 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. స్నేహ్ రాణా(54 బంతుల్లో 3 ఫోర్లతో 30) పర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లలో జెమీమా రోడ్రిగ్స్(14), హర్మన్‌ప్రీత్ కౌర్(11) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 62.4 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది, జెమీమా రోడ్రిగ్స్(84 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. షఫాలీ వర్మ(48 బంతుల్లో 6 ఫోర్లతో 35), కాశ్వీ గౌతమ్(54 బంతుల్లో 3 ఫోర్లతో 34 నాటౌట్) పర్వాలేదనిపించారు. అనాబెల్ సదర్లాండ్ 4 వికెట్లు పడగొట్టగా.. లూసీ హామిల్టన్‌కు 3 వికెట్లు దక్కాయి.

అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 90.4 ఓవర్లలో 323 పరుగుల భారీ స్కోర్ వద్ద ఆలౌటైంది. అన్నబెల్ సదర్లాండ్(171 బంతుల్లో 17 ఫోర్లతో 129) సెంచరీతో రాణించగా.. ఎల్లిస్ పెర్రీ(116బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 76) హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. భారత బౌలర్లలో సయాలి సత్ఘరే(4/50) నాలుగు వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్(2/72), దీప్తి శర్మ(2/67) రెండేసి వికెట్లు తీసాడు. స్నేహ్ రాణా, షెఫాలీ వర్మ చెరో వికెట్ తీసారు.
125 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 149 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఆసీస్ ముందు 25 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. దాదాపు 20 నెలల తర్వాత భారత మహిళల జట్టు టెస్ట్ క్రికెట్ ఆడుతుండటం.. అందులో పింక్‌బాల్‌తో ఆడిన అనుభవం పెద్దగా లేకపోవడంతో ఆసీస్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన అన్నబెల్ సదర్లాండ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ మ్యాచ్‌తో అలీసా హీలీ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.