Australia Playing XI: స్మిత్ కీలక నిర్ణయం.. ఆఖరి టెస్ట్‌లో భారత్‌తో ఆడే ఆసీస్ టీమ్ ఇదే!

అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్‌కు ఆస్ట్రేలియా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానున్న నాలుగో టెస్ట్‌లో ఆతిథ్య భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇండోర్ టెస్ట్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్న ఆసీస్.. అదే జోరులో చివరి టెస్ట్ గెలిచి సిరీస్ సమం చేయాలనుకుంటోంది. మరోవైపు నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా చివరి టెస్ట్‌ను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంథోనీ ఆల్బనీస్ రానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..
ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో తాత్కలిక కెప్టెన్‌గా జట్టును నడిపించిన స్మిత్.. సూపర్ కెప్టెన్సీ జట్టుకు అదిరిపోయే విజయాన్నందించాడు. తన ట్రేడ్‌మార్క్ కెప్టెన్సీతో భారత్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఎప్పటికప్పుడూ జట్టు ఆటగాళ్లలో స్పూర్తి నింపుతూ.. చిన్న తప్పిదం చేయకుండా భారత్ పతనాన్ని శాసించాడు. చివరి టెస్ట్‌కు కూడా ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్మితే కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. భారత పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న స్మిత్.. తన సారథ్యంతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. చివరి టెస్ట్‌కు కూడా ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగాలని స్మిత్ నిర్ణయించుకున్నట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

విన్నింగ్ కాంబినేషనే..
పిచ్ ఎలా ఉన్నా.. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించనున్నారు. కాస్త బ్యాటింగ్ అనుకూలంగా ఉండే పిచ్ తయారు చేసినా... టర్నింగ్ ట్రాక్‌నే సిద్దం చేస్తారని స్మిత్‌కు బాగా తెలుసు. ఇక తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్.. మూడో టెస్ట్‌తో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్.. విలువైన పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్.. ఉస్మాన్ ఖవాజా సూపర్ బ్యాటింగ్‌తో ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

3+2 బౌలింగ్ కాంబినేషన్..
ఫస్ట్ డౌన్‌లో మార్నస్ లబుషేన్, నాలుగో స్థానంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ బరిలోకి దిగనున్నారు. ఐదో స్థానంలో కామెరూన్ గ్రీన్ బరిలోకి ఆడనుండగా... ఆరో స్థానంలో పీటర్ హ్యాండ్‌స్కోంబ్, ఏడో స్థానంలో కీపర్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేయనున్నారు. మిచెల్ స్టార్క్‌తో కలిసి నాథన్ లయన్, టాడ్ మర్ఫీ, మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. మూడో టెస్ట్‌లో నాథన్ లయన్, కుహ్నేమన్ భారత పతనాన్ని శాసించారు. వికెట్లు తీయకపోయినా.. టాడ్ మర్ఫీ తన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ముగ్గురు స్పిన్నర్లు.. ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో ఆసీస్ బరిలోకి దిగనుంది.

ఆసీస్ తుది జట్టు(అంచనా)
ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్(కెప్టెన్), కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్‌స్కోంబ్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, టాడ్ ముర్ఫీ, మాథ్యూ కుహ్నెమన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications