ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. బాక్సింగ్ డే(డిసెంబర్ 26) రోజున మెల్ బోర్న్ వేదికగా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ బరిలో నిలిచే తుది జట్టును ఆస్ట్రేలియా ప్రకటించింది. గత మ్యాచ్ తుది జట్టుతో పోల్చితే తాజా మ్యాచ్‌కు రెండు మార్పులు చేసింది.
నాథన్ మెక్‌స్వీని స్థానంలో 19 ఏళ్ల సామ్ కోన్‌స్టాస్‌కు అవకాశం కల్పించింది. గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన జోష్ హజెల్ వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్‌ను ఎంపిక చేసింది. యువ ప్లేయర్ సామ్ కోన్‌స్టాస్ ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు.

చరిత్ర సృష్టించనున్న కోన్‌స్టాస్-ఖవాజా
ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతను ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ క్రమంలో ఈ జోడీ అరుదైన ఖాతాను తమ ఖాతాలో వేసుకోనుంది. ఉస్మాన్ ఖవాజా వయసు 38 ఏళ్లు అయితే సామ్ కోన్‌స్టాస్ 19 ఏళ్ల కుర్రాడు. అత్యంత ఎక్కువ వయసు వ్యత్యాసం కలిగిన తొలి ఓపెనింగ్ జోడీ చరిత్ర సృష్టించనున్నారు.
మెక్‌స్వీని దారుణంగా విఫలమవడంతో దేశవాళీ క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న సామ్ కోన్‌స్టాస్‌కు ఆసీస్ మేనేజ్‌మెంట్ అవకాశం కల్పించింది. డిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్‌కు ముందు భారత్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తరఫున బరిలోకి దిగిన సామ్ కోన్‌స్టాస్ సెంచరీతో రాణించాడు. 97 బంతుల్లో 107 పరుగులతో సత్తా చాటాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
ఫిట్‌నెస్ సాధించిని డేంజరస్ బ్యాటర్..
తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పూర్తిగా కోలుకున్నాడు. ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయడంతో అతను తుది జట్టులోకి వచ్చాడు. 19 ఏళ్ల సామ్ కోన్‌స్టాస్‌కు ప్యాట్ కమిన్స్ కీలక సలహా ఇచ్చాడు. అనవసర ఒత్తిడికి గురి కాకుండా ఆడాలని సూచించాడు. 'ట్రావిస్ హెడ్ పూర్తిగా కోలుకున్నాడు. ఫిట్‌నెస్ సాధించేందుకు చాలా కష్టపడ్డాడు.
యువ ఆటగాడు సామ్ కోన్‌స్టాస్ అరంగేట్రం చేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం నేను కూడా 18 ఏళ్ల వయసులోనే అరంగేట్ర చేశాను. ఇప్పుడు సామ్ కోన్‌స్టాస్‌ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుంది. ఈ సందర్భంగా అతనికి నేనిచ్చే సలహా ఒక్కటే. ఇతర గేమ్‌ల మాదిరిగా ఈ టెస్ట్‌ను ఆడమని చెబుతా. ఎలాంటి ఒత్తిడికి గురికావద్దు.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా తుది జట్టు:
ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ(వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్.