
ఆసీస్ బోణీ కొట్టేనా?
ఓ వైపు ఐదు సార్లు వన్డే ప్రపంచకప్‌ను దక్కించుకున్నప్పటికీ ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని ఆస్ట్రేలియా జట్టు.. మరోవైపు ఇప్పటివరకూ వన్డేలు, టీ20ల్లో కలిపి ఒక్క ప్రపంచకప్‌ను కూడా ముద్దాడని సౌతాఫ్రికా జట్టు.. ఈ సారి పొట్టి కప్పు పట్టేసి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇప్పుడు అవే జట్ల మధ్య మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్ సూపర్- 12 దశకు తెరలేవనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ జట్ల మధ్యే ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. టాప్ ఆర్డర్ వైఫల్యం.. తాజా ఫామ్.. ఆస్ట్రేలియాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ టోర్నీకి ముందు వరుసగా అయిదు టీ20 సిరీస్‌ల్లో ఓడడం ఆ జట్టును కలవరపరిచే అంశమే. వార్నర్, కెప్టెన్ ఫించ్ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది.
ఇక స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టాయినిస్, మిచెల్ మార్ష్‌తో కూడిన మిడిలార్డర్ పటిష్ఠంగా ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే మ్యాక్సీ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. స్పిన్‌కు సహకరించే పిచ్‌పై బౌలింగ్‌తో సత్తాచాటేందుకు జంపా, అగర్ సిద్ధమయ్యారు. కమిన్స్, స్టార్క్, రిచర్డ్‌సన్, హేజిల్‌వుడ్‌తో కూడిన పేస్ దళం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసరనుంది. సన్నాహక మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడిన ఆసీస్.. టోర్నీలో గెలుపుతో ప్రారంభించాలనుకుంటుంది. అయితే దారుణంగా విఫలమవుతున్న డేవిడ్ వార్నర్‌కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి. స్టార్ పేసర్ అయినంటువంటి ప్యాట్ కమిన్స్‌కు తుది జట్టులో చోటు లేదు.

ఊపు మీదున్న సఫారీ సేన..
మరోవైపు వరుస విజయాలతో.. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో అడుగుపెడుతుంది. వెస్టిండీస్, ఐర్లాండ్, శ్రీలంకతో వరుసగా మూడు టీ20 సిరీస్‌లు నెగ్గి ఊపు మీదున్న సఫారీ సేన.. ఈ ప్రపంచకప్‌లో రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. అయితే కీలక మ్యాచ్‌ల్లో ఒత్తిడి అధిగమించలేదనే అపవాదు సౌతాఫ్రికాపై ఉంది. ఈసారి ఆ ట్యాగ్‌ను తుడిచి పెట్టి టైటిల్ సాధిస్తారో లేదో చూడాలి. కెప్టెన్ బవుమా, క్వింటన్ డికాక్, హెండ్రిక్స్, మార్‌క్రమ్‌లో కూడిన టాప్ ఆర్డర్ పటిష్ఠంగా ఉంది. మిడిలార్డర్ మాత్రం బలహీనంగా ఉంది. బిగ్ హిట్టర్ అయిన డేవిడ్ మిల్లర్ ఫామ్ కలవరపరుస్తోంది. రబడా, ఎంగిడి, నోర్జ్‌లతో పేస్ విభాగం బలంగానే ఉంది. షంసి, కేశవ్‌లతో స్పిన్ విభాగం కూడా అత్యుత్తమంగా కనిపిస్తోంది.

తుది జట్లు (అంచనా)..
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టాయినిస్, మాథ్యూ వేడ్, అష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్, బవుమా, మార్‌క్రమ్, డసెన్, డేవిడ్ మిల్లర్, క్లాసెన్, ముల్డర్, కగిసో రబడా, కేశవ్, అన్రిచ్ నోర్జ్/లుంగి ఎంగిడి, షంసి


Click it and Unblock the Notifications












