
దుబాయ్: ఎక్కడ ఎలా ఆడినా.. వరల్డ్ కప్ అనగానే శక్తినంతా కూడదీసుకోవడం వాళ్ల నైజం! అప్పటిదాకా ఫామ్‌లో లేకున్నా కప్పును చూడగానే కలసికట్టుగా.. కసితీరా ఆడటం వాళ్లకు ఇష్టం. ఫేవరెట్ అయినా అండర్ డాగ్ అయినా.. టైటిల్ ఫైట్‌కు రాగానే ఖతర్నాక్ ఆటతో అవతలి టీమ్ మైండ్ బ్లాంక్ చేయడం వాళ్ల ఇజం. అలాంటి తిరుగులేని ఆటతో.. చెక్కు చెదరని రికార్డుతో వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. ఒక్క టీ20 ప్రపంచకప్ మాత్రం అందుకోలేకపోయింది.
ఇప్పుడు ఆ ముచ్చటా తీరింది. స్వదేశంలో 2015 ప్రపంచకప్ తర్వాత ఆరేళ్లుగా మరో టైటిల్ అందుకోలేక.. ఈ టోర్నీకి ముందు బంగ్లాదేశ్ చేతిలో టీ20 సిరీస్ ఓడి.. పెద్దగా అంచనాలే లేకుండా వచ్చిన కంగారు టీమ్ అరబ్ గడ్డపై అద్భుతమే చేసింది. తమదైన శైలిలో తమకు మాత్రమే సాధ్యమయ్యే ఆటతో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. తమ పొరుగు దేశం న్యూజిలాండ్ ప్రపంచకప్ ఆశలపై నీళ్లు కుమ్మరిస్తూ.. పొట్టి ఫార్మాట్‌లో చాంపియన్ అయ్యింది. ఓవరాల్‌గా ఆరో ప్రపంచకప్‌తో సిక్సర్ కొట్టింది.
తాము డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అన్నట్టగా హోరాహోరీ తప్పదనుకున్న టైటిల్ ఫైట్‌ను ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆసీస్ ఏక పక్షం చేసింది. సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంతో ఆసీస్ ఆటగాళ్ల సంతోషానికి హద్దేలేకుండా పోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వారు చేసిన రచ్చ మాములుగా లేదు. 'మందేస్తూ చిందేయరా.. చిందేస్తూ మందేయరా' అంటూ చేతిలో బీర్ టిన్స్ పట్టుకొని రచ్చరచ్చ చేశారు. తమకు నచ్చిన మ్యూజిక్‌తో చిందేశారు. శాంపైన్ బాటిల్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను తడిపేసారు. మైకంలో తూగుతూ వారు చేసిన డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది. వారి సెలెబ్రేషన్‌కు ఫిదా అయిన ఐసీసీ సైతం ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. దాంతో వారి సెలెబ్రేషన్స్ ప్రపంచానికి తెలిసింది. ముఖ్యంగా గాగుల్స్ ధరించి చేతిలో బీర్ టిన్‌తో ఆడమ్ జంపా చేసిన స్లోమోషన్ డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 85) అద్భుతంగా ఆడగా... హాజల్‌వుడ్ (3/16) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచాడు.