ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లోనూ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ సిరీస్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ 4-1తో యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకుంది. నాలుగో టెస్ట్‌లో గెలిచి ఉత్సాహం కనబర్చిన ఇంగ్లండ్‌కు ఆఖరి టెస్ట్‌లో ఘోర పరాభావం ఎదురైంది.
302/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 88.2 ఓవర్లలో 342 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ హీరో జాకోబ్ బెతెల్( 265 బంతుల్లో 15 ఫోర్లతో 154)ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు అతను 12 పరుగులు మాత్రమే చేశాడు.
జోష్ టంగ్(6) సాయంతో మాథ్యూ పోట్స్(18 నాటౌట్) కాసేపు పోరాడినా.. మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. జోష్ టంగ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/72), బ్యూ వెబ్‌స్టార్(3/64)మూడేసి వికెట్లు తీయగా.. మైఖేల్ నేసర్ ఒక వికెట్ పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ రెండు వికెట్లు తీసాడు.

183 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా ముందు 160 పరుగుల లక్ష్యం నమోదైంది. వన్డే తరహా బ్యాటింగ్‌తో ఆసీస్ 31.2 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(29), జాక్ వెదరాల్డ్(34), మార్నస్ లబుషేన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(3/42) మూడు వికెట్లు తీయగా.. విల్ జాక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 97.3 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(160) సెంచరీతో చెలరేగగా.. హ్యారీ బ్రూక్(84) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మైఖేల్ నేజర్(4/60) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కామెరూన్ గ్రీన్, మార్నస్ లబుషేన్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(163), స్టీవ్ స్మిత్(138) సెంచరీలతో చెలరేగగా.. బ్యూ వెబ్‌స్టర్(71 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 384 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 567 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 342 ఆలౌట్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 161/5