
సిడ్నీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ సెగ క్రికెట్‌కు కూడా తగిలింది. ఇప్పటికే ఐసీసీ.. మలేషియా వేదికగా జరగాల్సిన సీడబ్ల్యూసి ఛాలెంజ్ లీగ్ మ్యాచ్‌లను వాయిదా వేసింది. థాయ్‌లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే మధ్య జరగాల్సిన టీ-20 సిరీస్‌లు కూడా రద్దయ్యాయి. అంతేకాక.. నేపాల్ ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్‌ను కూడా రద్దు చేశారు. భారత్‌లో కూడా ఈ వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2020 సీజన్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ జరుగుతుందని రోజుకో ప్రకటన విడుదల చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే నో షేక్ హ్యాండ్ సంప్రదాయం తెరమీదకు వచ్చింది. బీసీసీఐ కూడా ఐపీఎల్ సందర్భంగా నో షేక్ హ్యాండ్.. నో సెల్ఫీస్ కార్యక్రమం చేపట్టాలనుకుంటుంది. ఇక శ్రీలంక పర్యటనలో తమ ఆటగాళ్లు కరచాలనం చేయరని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కరచాలనానికి బదులు 'ఫిస్ట్ బంప్ (పిడికిలితో పలకరింత)'తో పలకరిస్తామని రూట్ చెప్పాడు.
భారత్ పర్యటన రానున్న సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా తాము షేక్ హ్యాండ్ ఇవ్వమని ప్రకటించారు. అయితే ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ ముందు ఈ షేక్ హ్యాండ్ వ్యవహారాన్ని ప్రస్తావించిగా.. తాము బరాబర్ షేక్ హ్యాండ్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. తమ కిట్స్‌లో హ్యాండ్ వాష్ సానిటైజర్స్ పుష్కలంగా ఉన్నాయని.. తాము శుభ్రంగా చేతులు కడుక్కుంటామని తెలిపాడు.
'మేం కరచాలనం చేస్తాం. ఆస్ట్రేలియా కిట్స్‌లో పుష్కలమైన హ్యాండ్ వాష్ సానిటైజర్స్ ఉన్నాయి. మేం కచ్చితంగా షేక్య హ్యాండ్ సంస్కృతిని కొనసాగిస్తాం. ' అని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇటీవల సఫారీలతో ముగిసిన వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా వైట్ వాష్ గురైన విషయం తెలిసిందే. తీరిక లేని షెడ్యూల్ వల్లే ఈ ఫలితం వచ్చిందని లాంగర్ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకొని బరిలోకి దిగుతామని చెప్పుకొచ్చాడు. మార్చి 13 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.