
సిడ్నీ: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ బరిలోకి దిగే ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది. సీనియర్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజాకు సెలెక్టర్లు మళ్లీ అవకాశం ఇచ్చారు. 2019 యాషెస్ సిరీస్ అనంతరం జట్టుకు దూరమైన ఖవాజా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో క్విన్స్‌ల్యాండ్ కెప్టెన్‌గా దుమ్మురేపడంతో ఖవాజాను ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు.
గాయంతో ఈ సిరీస్‌కు వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ దూరమవ్వడంతో అతని స్థానంలో ట్రావిడ్ హెడ్‌ను తీసుకున్నారు. అనామక క్రికెటర్లు మేకేల్ నెసర్, జై రిచర్డ్‌సన్‌లు బ్యాకప్ బౌలర్లుగా జట్టులో చోటు దక్కించుకున్నారు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో సూపర్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన మిచెల్ మార్ష్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు మార్ష్‌ను ఎంపిక చేయలేదు.
భారత్-పాకిస్థాన్ మాదిరి.. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్ క్రికెట్ ప్రపంచంలో చాలా ప్రత్యేకమైనది.1882 లో ది ఓవల్ స్టేడియంలో జరిగిన ఓ ఆసక్తికరమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఇంగ్లండ్ అనుహ్యంగా ఓడిపోయింది. అయితే ఇంగ్లండ్ గడ్డపై ఆసీస్‌కి ఇదే మొట్టమొదటి విజయం. దీంతో ఓ ఇంగ్లీష్ వార్తాపత్రిక, ఇంగ్లండ్ క్రికెట్ చనిపోయిందనే ఉద్దేశంతో 'అంత్యక్రియలు జరపగా వచ్చిన బూడిద (యాషెస్)ను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తారు' అంటూ రాసుకొచ్చింది. 1883లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు, ఇంగ్లీష్ మీడియా 'యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ' వార్తలు ప్రచురించాయి. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌కు 'ది యాషెస్'అనే పేరు వచ్చింది.
ఈ ప్రతిష్టాత్మక సిరీస్ డిసెంబర్ 8 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది. డిసెంబర్ 8న బ్రిస్బేన్‌లో తొలి టెస్టు, 16న ఆడిలైడ్‌లో రెండో టెస్టు, 26న మెల్‌బోర్న్‌లో మూడో టెస్టు ఆడుతుంది. 2022 జనవరి 5న సిడ్నీలో నాలుగో టెస్టు, పెర్త్‌లో జనవరి 14న జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.
ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు: టిమ్ పైన్ (సి), పాట్ కమిన్స్ , కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ , నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, జో రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్టార్క్, స్విప్సన్, డేవిడ్ వార్నర్