ఐపీఎల్‌లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఒక్క పరుగు విలువ రూ. 3.26 లక్షలు!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఆస్ట్రేలియా విధ్వంసకర క్రికెటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ మళ్లీ భారీ ధర పలికాడు. గత సీజన్‌లో దారుణంగా విఫలమైనా.. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్న ఈ ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. దాంతో మ్యాక్సీ ధర అమాంతం పెరిగిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌తో చివరి వరకు పోటీ పడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. రూ.14.25 కోట్ల భారీ ధరకు ఈ హార్డ్ హిట్టర్‌ను సొంతం చేసుకుంది.
అయితే ప్రతీ సీజన్‌లో భారీ ధర పలికి హాట్ టాపిక్‌గా నిలవడం ఆ తర్వాత తన పేలవ ఆటతో విమర్శలు ఎదుర్కొవడంతో గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు అలువాటైపోయింది. ఇప్పటి వరకు ఏడు సీజన్ల వేలంలో భారీ ధర పలికిన మ్యాక్సీ మొత్తం.. రూ.63.32 కోట్లు (తాజా రూ.14.25 కోట్లు కలిపి) తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ గత ఆరు సీజన్లలో కలిపి మొత్తం 1499 (2012 సీజన్ మినహా) పరుగులే చేశాడు. ఈ లెక్కన అతని ఒక్క పరుగు విలువ దాదాపు రూ.3.26 లక్షలు.

2012లో అరంగేట్రం..
2012లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన మ్యాక్స్‌వెల్.. ఆ సీజన్‌లో రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఢిల్లీ డేర్‌డేవిల్స్ తరఫున బరిలోకి దిగాడు. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 6 పరుగులు చేశాడు. కానీ ఆ తదుపరి సీజన్ ఐపీఎల్-2013 వేలంలో రూ.5.32 కోట్లు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇంత భారీ మొత్తానికి ముంబై ఇండియన్స్ అతన్ని కొనుగోలు చేసింది. అప్పట్లో మ్యాక్సీని 'మిలియన్ డాలర్ బేబీ'అని ముద్దుగా పిలిచారు. కానీ ఆ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో 27 బంతులు మాత్రమే ఆడిన మ్యాక్సీ.. కేవలం 36 పరుగులే చేశాడు.

36 సిక్స్‌లతో వీరవిహారం..
2014 సీజన్ వేలంలో మ్యాక్సీని పంజాబ్ రూ.6 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో ఈ ఆస్ట్రేలియా స్టార్ రఫ్ఫాడించాడు. 187.75 స్ట్రైక్‌రేట్‌తో 552 పరుగులు చేసి జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మ్యాక్సీ మొత్తం 36 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఈ పెర్ఫామెన్స్‌తో పంజాబ్ అతన్ని 2015, 2016, 2017 సీజన్ల వరకు కొనసాగించింది. కానీ అతను ఈ మూడు సీజన్లలో తీవ్రంగా నిరాశ పరిచాడు.145, 179, 310 పరుగుల చొప్పున చేశాడు.ఇక 2018లో మ్యాక్స్‌వెల్‌ను ఢిల్లీ రూ.9 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్‌లో కూడా అతను తీవ్రంగా నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌ల్లో 14.08 సగటుతో కేవలం 169 పరుగులు మాత్రమే చేశాడు.

ఒక్క సిక్స్ కొట్టలేదు..
ఇక 2019 సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌తో సహా చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా క్యాష్ రిచ్ లీగ్‌కు దూరంగా ఉన్నారు. 2020 సీజన్‌లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఈ ఆసీస్ స్టార్‌ను కింగ్స్ పంజాబ్ మళ్లీ రూ.10.75 కోట్లకు తీసుకుంది. కానీ ఈ సీజన్‌లో మ్యాక్సీ మరి దారుణంగా విఫలమయ్యాడు. యూఏఈ వేదికగా జరిగిన ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 108 రన్స్ మాత్రమే చేశాడు. కనీసం ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు.

ఈసారైనా...?
ఇక మ్యాక్సీ ఐపీఎల్, బీబీఎల్‌లో విఫలమైనా.. భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నింగ్స్ నాక్స్ ఆడాడు. దాంతో ఆర్‌సీబీ అతనిపై నమ్మకం ఉంచింది. తమ విధ్వంసకర ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌కు అతను తోడైతే తమకు తిరుగుండదని భావిస్తోంది. ఆ క్రమంలోనే అతని కోసం ఎంతటి ధరకైనా తెగించింది. ఇక ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్‌సీబీ, మ్యాక్స్‌వెల్.. ఈ సారి అద్భుతం చేస్తారనే నమ్మకంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు ఉన్నారు. మరీ మ్యాక్సీ ఏం చేస్తాడో? చూడాలి.!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications