
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ ఫాక్స్ స్పోర్ట్స్‌కు చెందిన స్పైడర్ క్యామ్ సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జేను బలంగా ఢీకొట్టింది. దాంతో అతను మైదానంలో కుప్పకూలాడు. అదృష్టవశాత్తు అతనికి గాయాలు కాకపోయినా.. ఈ అనూహ్య ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విచిత్రకర ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆట రెండో రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ పొజిషన్‌కు అన్రిచ్ వెళ్తుండగా.. వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక స్పైడర్ కెమెరా అతడిని బలంగా ఢీ కొట్టింది. దాంతో, అతను ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఊహించని పరిణామంతో షాక్ తిన్న అన్రిచ్ నేల మీద అలానే ఉండిపోయాడు. అతను పడిపోడం చూసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు పరుగున వచ్చారు. ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా వచ్చి అన్రిచ్ పరిస్థితి తెలుసుకున్నాడు.
మైదానంలో 360 డిగ్రీ వ్యూ కోసం స్పైడర్ కెమెరాలను ఉపయోగిస్తారు. ఇవి ఫీల్డర్ల మీద నుంచి వెళ్తూ సమాచారాన్ని చేరవేస్తాయి. అయితే ఫాక్స్ స్పోర్ట్స్ పరోక్షంగా ఆసీస్‌కు అండగా నిలుస్తుందని, ఉద్దేశ పూర్వకంగానే అన్రిచ్ నోర్జ్‌ను గాయపరచాలని చూసిందని ఓ నెటిజన్ ఆరోపించాడు. ఫస్ట్ స్పెల్‌లో అన్రిచ్.. ఆస్ట్రేలియా ఆటగాళ్లను వణికించాడని, దాంతో ఇలా చేశారని కామెంట్ చేశాడు. ఇంకొందరు స్పైడర్ క్యామ్ వాడవద్దని పేర్కొన్నారు.
ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్(254 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 200 రిటైర్ట్ హర్ట్) డబుల్ సెంచరీతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 91 ఓవర్లలో 3 వికెట్లకు 386 పరుగులు చేసింది. 45/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. వార్నర్‌కు తోడుగా స్టీవ్ స్మిత్(85) రాణించాడు. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(48 బ్యాటింగ్), అలెక్స్ క్యారీ(9 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 197 పరుగులకు చేరింది. సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జే, రబడా తలో వికెట్ తీసారు. డేవిడ్ వార్నర్‌తో పాటు కామెరూన్ గ్రీన్(6) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు.