ఒక్క దెబ్బతో మ్యాచ్ టర్న్.. 99 పరుగులకే ఆలౌట్!
దక్షిణాఫ్రికాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున దక్షిణాఫ్రికా బౌలర్లు ఊచకోత కోశారు. ఆతిథ్య జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. లెఫ్టార్మ్ పేసర్ మార్కో జాన్సెన్ బౌలింగ్ ధాటికి ఆసీస్ కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగుల కొండంత అధిక్యాన్ని సాధించిన దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాపై ఫాలో-ఆన్‌ను అమలు పరిచింది.
మార్కో జాన్సెన్ విధ్వంసం
సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో 85 పరుగులు చేసి సంచలనం సృష్టించిన మార్కో జాన్సెన్ బంతితోనూ ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టాడు. నాలుగో రోజు ఆట ప్రారంభంలోనే తాను వేసిన మొదటి బంతికే నైట్ వాచ్‌మన్ స్కాట్ బోలాండ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ వెంటనే ప్రమాదకరమైన ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. లంచ్ విరామానికి ముందే తన రెండో స్పెల్‌లో వరుసగా మాట్ రెన్‌షా(12), అలెక్స్ క్యారీ(0)లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత బ్యూ వెబ్‌స్టర్‌ను ఔట్ చేయడం ద్వారా మార్కో జాన్సెన్ తన ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకుని కంగారూల పతనాన్ని శాసించాడు.

స్టీవ్ స్మిత్ ఒంటరి పోరాటం
ఓ వైపు వికెట్లు వరుసగా పడుతున్నా ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ క్రీజులో నిలబడి పోరాడాడు. మెడ గాయంతో తీవ్ర ఇబ్బంది పడతూ, రెండు సార్లు స్టేడియంలోనే వైద్య చికిత్స తీసుకున్నప్పటికీ స్టీవ్ స్మిత్ తన ప్రత్యేకమైన టెక్నిక్‌తో జాన్సెన్, కగిసో రబాడాల బౌలింగ్‌ను తట్టుకున్నాడు. జట్టు తరఫున అత్యధికంగా 28 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను చివరకు వియాన్ ముల్డర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 99 పరుగులకే ముగిసింది.
దక్షిణాఫ్రికా ఆధిక్యం.. ఫాలో ఆన్ నిర్ణయం
తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 425 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాపై 326 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై సఫారీలకు ఇది మూడో అతిపెద్ద తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం. గతాన్ని పరిశీలిస్తే ఆస్ట్రేలియాపై ఇంత పెద్ద ఆధిక్యం సాధించిన ప్రతిసారీ దక్షిణాఫ్రికానే విజయం వరించింది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే గాయంతో స్టేడియాన్ని వీడినప్పటికీ.. కెప్టెన్ ప్రత్యర్థిపై ఏ మాత్రం జాలి చూపకుండా ఫాలో-ఆన్ ఆడించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ శతాబ్ధంలో మూడో సారి మాత్రమే..
ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టు ఫాలో-ఆన్ ఆడవలసి రావడం అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన సంఘటన. ఈ శతాబ్ధంలో ఆస్ట్రేలియా టెస్టుల్లో ఫాలో-ఆన్ ఆడటం ఇది కేవలం మూడోసారి మాత్రమే. అంతకుముందు 2005 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులోనూ, 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్‌పై సిడ్నీ టెస్టులోనూ ఆసీస్ ఫాలో-ఆన్ ఆడింది. డర్బన్‌లో జరిగిన తొలి టెస్టులో 214 పరుగుల తేడాతో ఓడిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సిరీస్‌ను సమం చేసే దిశగా అడుగులు వేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


