సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. సిడ్నీ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. పాకిస్థాన్ విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 25.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేధించింది.
కెరీర్‌లో చివరి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(75 బంతుల్లో 7 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తన టెస్ట్ కెరీర్‌ను అద్భుతంగా ముగించాడు. ఉస్మాన్ ఖవాజా(0) విఫలమైనా.. మార్నస్ లబుషేన్(73 బంతుల్లో 9 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో సాజిద్ ఖాన్(2/49) రెండు వికెట్లు తీసాడు.

అంతకుముందు 68/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో115 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్(28) మరో 22 పరుగులు జోడించి ఔటవ్వగా.. ఆమీర్ జమాల్(18) సైతం అతన్ని అనుసరించాడు. హసన్ అలీ(5)ని నాథన్ లయన్ ఔట్ చేయడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(4/16) నాలుగు వికెట్లు తీయగా.. నాథన్ లయన్(3/36) మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 77.1 ఓవర్లలో 313 పరుగుల భారీ స్కోర్ చేసింది. లోయర్డార్ బ్యాటర్ ఆమీర్ జమాల్(97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82) అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్(5/61) ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 109.4 ఓవర్లలో 299 పరుగులకు కుప్పకూలింది. మార్నస్ లబుషేన్(60), మిచెల్ మార్ష్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఆమెర్ జమాల్(6/69)ఆరు వికెట్లతో చెలరేగాడు. 14 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్.. జోష్ హజెల్ వుడ్ ధాటికి తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.