AUS vs NZ: వన్డే ప్రపంచకప్ 2023లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. కంగారు టీమ్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. సూపర్ ఫీల్డింగ్ ఆస్ట్రేలియాను గట్టెక్కించగా.. జేమ్స్ నీషమ్ రనౌట్ అవ్వడం న్యూజిలాండ్ కొంపముంచింది.
అనూహ్య మలుపులతో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. ఈ మెగా టోర్నీలోనే ఇది అత్యుత్తమ మ్యాచ్‌గా నిలిచిపోయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.2 ఓవర్లలో 388 పరుగులకు కుప్పకూలింది. ట్రావిస్ హెడ్(67 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో రాణించాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), ప్యాట్ కమిన్స్(14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 37) మెరుపులు మెరిపించారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(3/77), గ్లేన్ ఫిలిప్స్(3/37) మూడేసి వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/80) రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులే చేసి ఓటమిపాలైంది. రచిన్ రవీంద్ర(89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 116) శతక్కొట్టగా.. డారిల్ మిచెల్(51 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 54), జేమ్స్ నీషమ్(39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(2/70), ప్యాట్ కమిన్స్(2/66) రెండేసి వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా(3/74) మూడు వికెట్లతో సత్తా చాటాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్(1/62)కు ఓ వికెట్ దక్కింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా తమ నాలుగో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయం కోసం కొదమ సింహాల్లా తలపడ్డాయి. చివరి 12 బంతుల్లో హైడ్రామా చోటు చేసుకుంది. న్యూజిలాండ్ విజయానికి 12 బంతుల్లో 32 పరుగులు అవసరమయ్యాయి. హజెల్ వుడ్ వేసిన 49వ ఓవర్ తొలి బంతికి ట్రెంట్ బౌల్ట్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా అందుకున్న లబుషేన్ సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కేసాడు. దాంతో క్యాచ్ ఔట్ కాస్త సిక్సర్‌గా మారింది.
ఈ అనూహ్య ఘటనతో మూమెంటమ్ అంతా న్యూజిలాండ్ వైపు షిఫ్ట్ అవ్వగా.. జేమ్స్ నీషమ్ మరో బౌండరీ బాది ఆసక్తి రేకెత్తించాడు. చివరి రెండు బంతులను అద్భుతంగా బౌలింగ్ చేసిన హజెల్ వుడ్ పరుగులివ్వలేదు. ఆఖరి ఓవర్‌లో కివీస్ విజయానికి 19 రన్స్ అవసరం కాగా.. బౌల్ట్ సింగిల్ తీసి నీషమ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఈ ఓవర్ రెండో బంతిని స్టార్క్ వైడ్ వేయగా.. కీపర్‌ను మిస్సైన బంతి బౌండరీకి వెళ్లింది.
దాంతో ఐదుపరుగులు వచ్చాయి. చివరి ఐదు బంతుల్లో 13 పరుగులు అవసరం కాగా.. స్టార్క్ బౌండరీ ఇవ్వకుండా కట్టడిగా బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం అద్భుత ఫీల్డింగ్‌తో రెండు బౌండరీలు అడ్డుకున్నారు. చివరి రెండు బంతులకు 7 పరుగులు చేయాల్సి ఉండగా.. జేమ్స్ నీషమ్ స్ట్రైకింగ్ కోసం డబుల్ తీసే ప్రయత్నంలో లబుషేన్ సూపర్ త్రోకు రనౌటయ్యాడు.
దాంతో న్యూజిలాండ్ ఓటమి ఖాయమైంది. ఆ రెండు బౌండరీల్లో ఒక్కటైనా ఆసీస్ ఆటగాళ్లు ఆపకపోయి ఉంటే న్యూజిలాండ్ విజయం లాంఛనమయ్యేది. ఈ మ్యాచ్‌లో 'అదృష్టం తలుపు తడితే.. దురదృష్టం వెనక్కి డోర్‌ను తట్టిందంట'అన్నట్లుగా న్యూజిలాండ్ పరిస్థితి మారింది.