టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ కష్టమేనని ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టును నడిపించడం బుమ్రాకు అంత సులువు కాదని అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. అయితే ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. తన సతీమణి రెండో బిడ్డకు జన్మనిచ్చే సమయంలో పక్కనే ఉండేందుకు రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే రోహిత్ శర్మ గైర్హాజరీపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రోహిత్ శర్మ దూరమైతే వైస్ కెప్టెన్ హోదాలో జస్‌ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. ఈ క్రమంలోనే బుమ్రాకు కెప్టెన్సీ కష్టమవుతుందని ఐసీసీ రివ్యూలో పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. 'జస్‌ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ చాలా కష్టమవుతోంది.
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా కమిన్స్ బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా నాకు ఇలానే అనిపించింది. కెప్టెన్సీ వల్ల కమిన్స్ సరిగ్గా బౌలింగ్ చేయగలుగుతాడా? ఎక్కువ స్పెల్స్ వేస్తాడా? వికెట్లు తీయగలుగుతాడా? అనే ప్రశ్నలు వెంటాడాయి. ఇప్పుడు బుమ్రా విషయంలోనూ అలానే అనిపిస్తోంది.
అయితే ఎంతో అనుభవం కలిగిన బుమ్రా.. కెప్టెన్‌గా ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోగలడు. భారత జట్టులో అనుభవం కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారు బుమ్రాకు అండగా ఉంటారు. కెప్టెన్ ఎప్పుడూ అనుభవం కలిగిన ఆటగాళ్ల సలహాలు, సూచనలు స్వీకరించాలి. ఎందుకంటే కొన్నిసార్లు కెప్టెన్‌గా తీసుకునే నిర్ణయాలు సరైనవేనా? అనే సందేహం కలుగుతోంది.
అలాంటి సమయంలో సహచర ఆటగాళ్ల సాయం తీసుకోవాలి. నేను గిల్‌క్రిస్ట్, మాథ్యూ హెడెన్‌ల నుంచి సలహాలు స్వీకరించేవాడిని. కెప్టెన్సీ విషయంలో వారి సాయం కోరేవాడిని. చాలా సలహాలు ఇచ్చినప్పుడు కెప్టెన్‌గా అత్యుత్తమ నిర్ణయం తీసుకోవాలి. బుమ్రా అసాధారణమైన బౌలర్. చాలా రోజులుగా భారత బౌలింగ్ లైనప్‌ను నడిపిస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో టీమిండియాకు విజయాలు అందిస్తుననాడు.'అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.