
మెల్‌బోర్న్: అడగందే అమ్మైనా అన్నంపెట్టదు అంటారు పెద్దలు. ఈ సామెతను గట్టిగా ఫాలో అయ్యాడో ఏమో కానీ ఓ క్రికెట్ అంపైర్.. నోరు తెరిచి అడిగేవరకు ఔటివ్వలేదు. ఈ ఆసక్తికర ఘటన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఔట్ విషయంలో అంపైర్ పాల్ విల్సన్ వినూత్నంగా ప్రవర్తించాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ గట్టిగా అరవడంతో ఔటిచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇదెక్కడి కామెడీరా అంపైర్ మామ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓలీ స్టోన్ వేసిన ఈ ఓవర్ మూడో బంతిని స్మిత్ ఆఫ్ సైడ్ జరిగి ఫైన్‌లెగ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. స్మిత్ జరగడాన్ని గమనించిన ఓలీ స్టోన్ తెలివిగా బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ వేయడంతో బ్యాట్‌ను మిస్సయిన బంతి స్మిత్ గ్లోవ్స్‌ను తాకుతూ కీపర్ బట్లర్ చేతిలో పడింది.
ఎలాంటి అప్పీల్ చేయకుండా బట్లర్ ఔటన్నట్లు చేతిని పైకెత్తగా.. అంపైర్ పాల్ విల్సన్ పట్టించుకోలేదు. దాంతో గట్టిగా అరిచిన బట్లర్.. రివ్యూ కోరాడు. కానీ బట్లర్ అరుపులు విన్న పాల్ విల్సన్ రివ్యూ కోరడాన్ని పట్టించుకోకుండానే ఔటిచ్చేసాడు. ఇక స్మిత్ మాత్రం తనకేం తెలియదన్నట్లు నక్కవేషాలు వేసాడు. ఔటౌ? అన్నట్లు అడుగుతూ క్రీజును వీడాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 48 ఓవర్లలో 5 వికెట్లకు 355 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(130 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 152), డేవిడ్ వార్నర్(102 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 106) సెంచరీలతో రాణించారు. ఈ సెంచరీతో వార్నర్ రెండున్నరేళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఒలీ స్టోన్ ఒక్కడే నాలుగు వికెట్లు తీయగా.. లియామ్ డాసన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 15 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. హజెల్ వుడ్ బౌలింగ్‌లో ఓపెనర్ డేవిడ్ మలాన్(2) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.