జమ్మూ కశ్మీర్ రంజీ టీమ్ చరిత్ర సృష్టించింది. 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తొలి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. శనివారం కర్ణాటకతో ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జమ్మూ కశ్మీర్‌ను విజేతగా ప్రకటించారు.
1959-1960లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన జమ్మూ కశ్మీర్.. తన 67 ఏళ్ల దేశవాళీ చరిత్రలో రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం.. గెలవడం ఇదేతొలిసారి. ఈ చరిత్రాత్మక క్షణాల్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రత్యక్షంగా వీక్షించారు. జమ్మూ కశ్మీర్ క్రికెట్ మాజీ డైరెక్టర్, బీసీసీఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ ఈ మ్యాచ్‌ను తొలి రోజు నుంచే దగ్గరుండి చూశాడు.
2025-26 సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచి బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జమ్మూ కశ్మీర్.. ఫైనల్లోనూ కర్ణాటకను మట్టికరిపించింది. కర్ణాటకలోని హుబ్లి వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ 584 పరుగులు భారీ స్కోర్ చేసింది. శుభమ్ పుండిర్(121) సెంచరీతో రాణించగా.. యవెర్ హసన్(88), కెప్టెన్ పరాస్ డొగ్రా(70), అబ్దుల్ సమద్(61), వధావన్(70), సాహిల్ లోత్రా(72) హాఫ్ సెంచరీలతో రాణించారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(5/99) ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

అనంతరం కర్ణాటక 93.3 ఓవర్లలో 293 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(266 బంతుల్లో 21 ఫోర్లతో 160) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆకీబ్ నబీ(5/54) ఐదు వికెట్లు తీయగా.. సునీల్ కుమార్(2/51), యుధ్వీర్ సింగ్(2/55) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం జమ్మూ కశ్మీర్ రెండో ఇన్నింగ్స్‌లో 342/4 స్కోర్ వద్ద డిక్లేర్ ఇవ్వడంతో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో కర్ణాటక కెప్టెన్ డ్రాకు అంగీకరించాడు. దాంతో టోర్నీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న జమ్మూ కశ్మీర్‌ను విజేతగా ప్రకటించారు. బారుముల్ల ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ 60 వికెట్లతో జమ్మూ కశ్మీర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్‌ల్లో 12.56 సగటుతో అతను ఈ ఫీట్ సాధించాడు. బ్యాటింగ్‌లో 245 పరుగులు చేసిన ఆకిబ్ నబీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.
రంజీ ట్రోఫీ 2025-26లో విజేతగా నిలిచిన జమ్మూ కశ్మీర్‌కు బీసీసీఐ తరఫున 5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందనుంది. రన్నరప్ జట్టుకు కూడా 3 కోట్ల రూపాయల నజరానా దక్కనుంది.