చెన్నై: భారత్-పాకిస్థాన్ పోరు అంటే ఇరు దేశాల అభిమానులకే కాకుండా యావత్ ప్రపంచానికి ఆసక్తే. అది క్రికెట్ అయినా మరే ఆటైనా.. భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ప్రత్యేకం. తాజాగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌కు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వచ్చాడు. భారత జట్టుకు మద్దతుగా నిలిచి హాకీ గేమ్‌ను ఆస్వాదించాడు.
మ్యాచ్ సాగుతున్నంత సేపు 'వందేమాతరం' నినాదాలతో మైదానం దద్దరిల్లింది. ఏఎల్ రెహ్మాన్ స్వరపరిచిన 'మా తుఝే సలాం'పాట మారుమోగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో భారత్ 4-0 తేడాతో పాకిస్థాన్‌ను మట్టి కరిపించింది. టీమిండియా ఆల్‌రౌండ్ షో ముందు పాకిస్థాన్ నిలబడలేకపోయింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. జుగ్‌రాజ్ సింగ్, మన్‌దీప్ సింగ్ తలో గోల్ సాధించారు. ఇప్పటికే ఓటమెరుగని టీమ్‌గా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్.. చివరి రౌండ్ రాబీన్ లీగ్ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి ఆ జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది.
ఈ టోర్నీ అనంతరం చైనా వేదికగా జరిగే ఆసియా గేమ్స్‌లో భారత హాకీ టీమ్, పాకిస్థాన్ హాకీ జట్టు ఒకే గ్రూప్‌లో బరిలోకి దిగనున్నాయి. ఈ పోటీల షెడ్యూల్ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 12 జట్లు రెండు గ్రూప్‌ల్లో పోటీ పడనున్నాయి. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్‌తో పాటు జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి.
గ్రూప్-బిలో కొరియా, మలేషియా, చైనా, ఒమన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా బరిలో నిలిచాయి. సెప్టెంబర్ 24న జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ ఉజ్బెకిస్తాన్‌తో తలపడుతోంది. 26న సింగపూరర్‌తో, 28న జపాన్‌తో, 30న పాకిస్థాన్‌తో, అక్టోబర్ 2న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.