ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. దాయాదీ పాకిస్థాన్ షాహీన్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్-ఏ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ పరాజయంతో గ్రూప్-బీలో భారత్-ఏ రెండో స్థానానికి పడిపోయింది. యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో 148 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది.
ఈ ఓటమితో సెమీఫైనల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. భారత్-ఏ సెమీఫైనల్ చేరాలంటే మంగళవారం ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. లేదంటే సెమీఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయి. గ్రూప్-బీలో భారత్, పాకిస్థాన్‌తో పాటు యూఏఈ, ఒమన్ ఉన్నాయి. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన యూఏఈ సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన పాకిస్థాన్ గ్రూప్-బీ టాపర్‌గా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. గ్రూప్-బీ నుంచి రెండో టీమ్‌గా సెమీఫైనల్ చేరేందుకు భారత్‌తో పాటు ఒమన్‌కు అవకాశం ఉంది. ఎవరు గెలిస్తే వారికే సెమీస్ బెర్త్ దక్కనుంది.

గ్రూప్-ఏలో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, శ్రీలంక, హాంగ్ కాంగ్ ఉండగా.. ఇంకా ఏ జట్టుకు సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు. రెండు గ్రూప్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లకు సెమీఫైనల్ బెర్త్ దక్కనుంది. శుక్రవారం ఈ టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఫైనల్ ఆదివారం జరగనుంది. భారత్, పాక్ జట్లు ఫైనల్లో మరోసారి తలపడే ఛాన్స్ ఉంది. లీగ్ మ్యాచ్‌లో ఓడినా ఫైనల్లో పాక్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), నమన్ ధీర్(20 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 35) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పాకిస్థాన్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మాజ్ సదాఖత్ (47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్-ఏ బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీసారు.