ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా దుమ్మురేపుతోంది. లీగ్ దశలో మూడింటికి మూడు మ్యాచ్‌లు గెలిచింది. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పసి కూన ఒమన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌కు ముందే సూపర్-4 బెర్త్‌ను దక్కించుకున్న టీమిండియా..ఈ గేమ్‌ను ప్రాక్టీస్‌కు ఉపయోగించుకుంది. సూపర్-4 దశలో టీమిండియా తమ తొలి పోరులో దాయాదీ పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. లీగ్ దశలో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో పాకిస్థాన్ ఉంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా భారత్‌కు పాకిస్థాన్ గట్టి పోటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ మ్యాచ్‌కు టీమిండియా తమ కాంబినేషన్‌లో మార్పులు చేయనుంది. ఒమన్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో తమ విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చిన టీమిండియా.. తిరిగి అదే జట్టును కొనసాగించనుంది. వరుణ్ చక్రవర్తీ, జస్‌ప్రీత్ బుమ్రా స్థానాల్లో తుది జట్టులోకి వచ్చిన అర్ష్‌దీప్ సింగ్, నితీష్ రాణాపై వేటు పడనుంది. వారిస్థానాల్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తీ తిరిగి జట్టులోకి రానున్నారు. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ ఒమన్‌పై పెద్దగా ప్రభావం చూపలేదు.
మిగతా జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. అయితే ఒమన్‌తో మ్యాచ్‌లో క్యాచ్ పడుతూ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతని తలకు గాయమవ్వడంతో మ్యాచ్ మధ్యలోనే అతను మైదానాన్ని వీడాడు. ఒకవేళ అతను ఫిట్‌గా లేకుంటే రింకూ సింగ్ లేదా అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగుతాడు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా కొనసాగనుండగా.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యాలు మిడిలార్డర్‌లో ఆడనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్‌తో పాటు వరుణ్ చక్రవర్తీ కొనసాగనున్నారు. బుమ్రా ఒక్కడే స్పెషలిస్ట్ పేసర్‌గా బరిలోకి దిగనుండగా.. అతనికి హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు అండగా నిలవనున్నారు.
సూపర్-4లో పాకిస్థాన్‌తో ఆడే భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ