టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం కొనసాగుతోంది. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో శుక్రవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ నిరాశపర్చాడు. 13 బంతులాడి ఒకే ఒక బౌండరీ కొట్టి 12 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. వానిందు హసరంగా బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది.
ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ వరుసగా.. 7*(2), 47*(37), 0(3), 5(11), 12(13) పరుగులతో తీవ్రంగా నిరాశపర్చాడు. ఆ 47 పరుగులు కూడా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆచితూచి ఆడాడు. ఆ మ్యాచ్‌లో సూర్య 127 స్ట్రైక్‌రేట్‌తో 5 బౌండరీలు, ఒక సిక్స్ మాత్రమే కొట్టాడు.

గతంలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సూర్య.. మిస్టర్ 360గా అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. తనకే సాధ్యమైన షాట్స్‌తో అభిమానులను అలరించాడు. తనదైన విధ్వంసంతో టీ20 బ్యాటింగ్‌కు కొత్త నిర్వచనం చెప్పాడు. ఏమైందో ఏమో కానీ గత కొన్ని రోజులుగా అతని బ్యాటింగ్‌లో మునపటి పవర్ కనిపించడం లేదు. ముఖ్యంగా టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సూర్య బ్యాటింగ్ ప్రదర్శన పడిపోయింది.
ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లోనూ తీవ్రంగా నిరాశపర్చాడు. కెప్టెన్‌గా అద్భుతమైన విజయాలు అందిస్తున్నా.. బ్యాటర్‌గా మాత్రం తన జోరును కొనసాగించలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల్లో 0, 12, 14, 0, 2 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్‌లో కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా.. నిలకడగా రాణించలేకపోయాడు. తాజాగా ఆసియా కప్‌లోనూ ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
గత 14 ఇన్నింగ్స్‌ల్లో అతను 50 ప్లస్ స్కోర్ చేయలేదు. సౌతాఫ్రికా పర్యటనలో 2023, డిసెంబర్ 14న టీ20ల్లో చివరిసారిగా(100) సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లోనూ 50 ప్లస్ స్కోర్ చేయలేదు. ఈ క్రమంలోనే సూర్యపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. సూర్య బ్యాటింగ్‌లోని దమ్ము తగ్గుతోందని, అతని బొమ్మ తిరగబడిందని కామెంట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా సూర్య తన బ్యాటింగ్ లోపాలను అధిగమించి రాణించాలని, లేకుంటే కెరీర్ ప్రమాదంలో పడుతుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(31 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), తిలక్ వర్మ(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. సంజూ శాంసన్(23 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 39), అక్షర్ పటేల్ (15 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్లలో మహీష తీక్షణ, దుష్మంత్ చమీర, వానిందు హసరంగ, డసన్ షనక, చరిత్ అసలంక చెరో వికెట్ తీసారు.