గత రెండు నెలలుగా ధనాధన్ బ్యాటింగ్ కోసం వేచి చూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2025 సీజన్ ముగింపుతో మూగబోయిన బ్యాట్లు.. ఇక సిక్సర్లు, బౌండరీల మోతతో దద్దరిల్లనున్నాయి. అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 టోర్నీకి మంగళవారం తెరలేవనుంది.
యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ కోసం ఆసియా క్రికెట్ దేశాలు సిద్దమయ్యాయి. ఆతిథ్య యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, ఒమన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్‌లు బరిలోకి దిగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ నెల ఆసాంతం జరగనున్న ఈ టోర్నీ అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా అందివ్వనుంది.
అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్ మధ్య అబుదాబి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు యూఏఈకి చేరుకున్నాయి. అఫ్గానిస్థాన్ ఇక్కడ ట్రై సిరీస్ కూడా ఆడింది. ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడినా.. లీగ్ దశలో ఆ జట్టును ఓడించింది. భారత్ తర్వాత పటిష్టంగా కనిపిస్తోంది. ఆసియాలో భారత్ తర్వాత తామే అత్యంత పటిష్టమైన జట్టుగా నిరూపించుకునేందుకు ఈ టోర్నీని ఉపయోగించుకోవాలని అఫ్గాన్ భావిస్తోంది. హాంగ్ కాంగ్‌తో పోరులో అఫ్గాన్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. అద్భుతం జరిగితే తప్పా ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ సునాయస విజయాన్నందుకుంటుంది. మరోవైపు హాంగ్ కాంగ్ మూడో సారి ఆసియా కప్ బరిలోకి దిగుతోంది. కానీ అఫ్గాన్‌కు పోటీనిచ్చే సామర్థ్యం అయితే హాంగ్ కాంగ్‌కు లేదు.

అఫ్గానిస్థాన్ జట్టు:
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, దర్వీష్ రసూలి, సెదిఖుల్లా అటల్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, కరీం జనత్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ ఇషాక్, ముజీబ్ ఉర్ రెహమాన్, అల్లా ఘజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫరీద్ మాలిక్, నవీన్-ఉల్-హక్, ఫజల్హక్ ఫరూఖీ.
హాంగ్ కాంగ్ జట్టు:
యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), బాబర్ హయాత్, జీషాన్ అలీ, నియాజకత్ ఖాన్ మహ్మద్, నస్రుల్లా రాణా, మార్టిన్ కోయెట్జీ, అన్షుమాన్ రథ్, కల్హాన్ మార్క్ చల్లు, ఆయుష్ ఆశిష్ శుక్లా, మహ్మద్ ఐజాజ్ ఖాన్, అతీక్ ఉల్ రెహ్మాన్ ఇక్బాల్, కించిత్ షా, ఆదిల్ మెహమూద్, హరూన్ మహ్మద్ అర్షద్, అలీ హసన్, షాహిద్ వాసిఫ్, ఘజాన్‌ఫర్ మహ్మద్, మహ్మద్ వహీద్, అనాస్ ఖాన్.