Asia Cup 2023: స్టార్ ప్లేయర్‌ను మరిచిన స్టార్ స్పోర్ట్స్.. గందరగోళంగా టీమ్ ప్రకటన!
న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 బరిలోకి దిగే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను టీమిండియా ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం వెల్లడించారు. అయితే ఈ టీమ్ ప్రకటన ముందు గందరగోళం చోటు చేసుకుంది.
అత్యుత్సాహంతో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ చేసిన తప్పిదం అయోమయానికి కారణమైంది. ఆసియాకప్ బరిలోకి దిగే భారత జట్టును అధికారికంగా ప్రకటించకముందే స్టార్ స్పోర్ట్స్ ఆ వివరాలను బహిర్గతం చేసింది. అయితే స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన జట్టులో శుభ్‌మన్ గిల్ పేరును మరిచిపోయింది.

త్వరగా ప్రకటించాలనే ఆతృతో లేక తప్పిదమో తెలియదు కానీ శుభ్‌మన్ గిల్ లేని జట్టును ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేసింది. టీమ్ ప్రకటన కోసం వేచి చూసిన మీడియా ప్రతినిథులను కూడా స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన టీమ్ అయోమయానికి గురి చేసింది. చివరకు అజిత్ అగార్కర్.. శుభ్‌మన్ గిల్ పేరును ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తమ ప్రధాన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అని అగార్కర్ స్పష్టం చేశాడు. రోహిత్ శర్మతో కలిసి అతనే ఓపెనింగ్ చేస్తాడని చెప్పాడు. వెస్టిండీస్ పర్యటనలో అతను విఫలమైనా.. ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడని గుర్తు చేశాడు. డబుల్ సెంచరీ, సెంచరీలతో పాటు ఐపీఎల్‌లోనూ మెరుగ్గా రాణించాడని తెలిపాడు.
శిఖర్ ధావన్ జట్టుకు ఎంతో చేసినా తాము శుభ్‌మన్ గిల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పాడు. అయితే స్టార్ స్పోర్ట్స్ శుభ్‌మన్ గిల్ పేరు లేకుండా జట్టును ప్రకటించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమ్ ప్రకటన విషయంలో ఎందుకంత ఆతృత? అని అసలు బీసీసీఐ అధికారికంగా ప్రకటించకుండా స్టార్ స్పోర్ట్స్ ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
ముందుగా ప్రకటించాలనే ఉత్సాహంలో స్టార్ స్పోర్ట్స్ నవ్వుల పాలైందని సెటైర్లు పేల్చుతున్నారు. కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చినా అతను కాస్త నొప్పితో బాధపడుతున్నాడని అగార్కర్ తెలిపాడు. దాంతో పాకిస్థాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు రాహుల్ దూరమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అప్పుడు గిల్ మిడిలార్డర్‌లో ఆడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications