కొలంబో: ఆసియాకప్ వన్డే టోర్నీల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ఓటమెరుగని కెప్టెన్‌గా దూసుకెళ్తున్నాడు. 2018 ఆసియాకప్‌లో తొలిసారి భారత జట్టుకు సారథ్యం వహించిన రోహిత్ శర్మ.. తాజా టోర్నీ వరకు మొత్తం 9 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు.ఇందులో 8 విజయాలు అందుకోగా ఒక్క మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అది కూడా తాజా టోర్నీలోనే పాకిస్థాన్ మ్యాచ్ ఫలితం తేలలేదు.
ఆసియాకప్‌లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోనీ(9) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజా టోర్నీల్లో భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో గురువారం చివరి సూపర్ మ్యాచ్ ఆడనున్న భారత్.. ఆదివారం ఫైనల్ ఆడనుంది. సూపర్ 4లో పాకిస్థాన్, శ్రీలంకపై భారీ విజయాన్నందుకు భారత్ ఇప్పటికే ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.

ఈ టోర్నీలో కెప్టెన్‌గా రోహిత్ బ్యాటింగ్ సగటు 85.16 ఉండగా.. స్ట్రైక్ రేట్ 98.93గా ఉంది. తాజా టోర్నీలో రోహిత్ శర్మ మూడు హాఫ్ సెంచరీలతో (194) టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్‌లో విఫలమైన రోహిత్.. ఆ తర్వాత నేపాల్, పాకిస్థాన్, శ్రీలకంతో జరిగిన మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో పాటు వన్డే క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ 205 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగుల మైలు రాయి అందుకోగా.. రోహిత్ శర్మ 241 ఇన్నింగ్స్‌లు, సచిన్ టెండూల్కర్(259), సౌరవ్ గంగూలీ(263), రికీ పాంటింగ్(266) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలిచాడు.
తన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ సిక్స్‌తో రోహిత్ 10 వేల మైలు రాయి అందుకోవడం విశేషం. తద్వారా ఆసియాకప్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గానూ రోహిత్ రికార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో పాక్ లెజెండ్ షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు. విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ శర్మ వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ప్లేయర్‌గా రికార్డు నమోదు చేశాడు.