కొలంబో: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఆసియాకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో రోహిత్ శర్మ(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ పేసర్ హసన్ షకీబ్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే రోహిత్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో ఆసియాకప్ చరిత్రలో అత్యధిక సార్లు రనౌట్ అయిన బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
భారత్ తరఫున ఆసియాకప్‌లో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా రెండేసి సార్లు డకౌటవ్వగా.. రోహిత్ తాజా ఇన్నింగ్స్‌తో వారిని అధిగమించాడు. ఆసియా కప్ చరిత్రలో డకౌట్ అయిన రెండో భారత కెప్టెన్‌గా కూడా రోహిత్ చెత్త రికార్డును లిఖించుకున్నాడు. రోహిత్ శర్మ కన్నా ముందు 1988 ఆసియాకప్‌లో అప్పటి భారత కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ డకౌటయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 29వ డకౌట్. టాపార్డర్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్(34), విరాట్ కోహ్లీ(33), వీరేంద్ర సెహ్వాగ్(31) రోహిత్ శర్మ కంటే ముందున్నారు. ఇక ఆసియా కప్‌లో రెండు సార్లు డకౌట్ అయిన తొలి భారత ఓపెనర్ కూడా రోహిత్ శర్మనే. ఇంతకుముందు ఏ భారత ఓపెనర్ కూడా రెండు సార్లు డకౌట్ కాలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. కెప్టెన్ షకీబ్ అల్ హసన్(85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), టౌహిడ్ హృదయ్(81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో నసుమ్ అహ్మద్(44), మెహ్‌దీ హసన్(29 నాటౌట్) విలువైన పరుగులు చేశారు.
భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/35) రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 139 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ(0)తో పాటు తెలుగు తేజం తిలక్ వర్మ(5), కేఎల్ రాహుల్(19), ఇషాన్ కిషన్(5), సూర్యకుమార్ యాదవ్(26) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(0 బ్యాటింగ్)తో కలిసి శుభ్‌మన్ గిల్(74 బ్యాటింగ్) పోరాడుతున్నాడు.