ముల్తాన్: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసిన ఆసియాకప్ 2023కి తెరలేచింది. పాకిస్థాన్‌లోని ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. నేపాల్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ డ్రైగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు.
'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ డ్రైగా.. స్మూత్‌గా కనబడుతోంది. తుది జట్టును ముందుగానే ప్రకటించడం వెనుక ఎలాంటి కారణం లేదు. మా జట్టుకు ఆత్మవిశ్వాసం ఇవ్వాలనే అలా చేశాం. నిజాయితీగా చెప్పాలంటే టాప్ ర్యాంక్ టీమ్‌గా మాపై కాస్త ఒత్తిడి ఉంది. ఆటను ఆస్వాదిస్తూ మా సాయశక్తులా విజయం కోసం పోరాడుతాం.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు.

నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ మాట్లాడుతూ.. ఆసియాకప్‌లో తొలి మ్యాచ్ ఆడటంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ కోసం నేపాల్‌లోని ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా ఎదురు చూశారని చెప్పాడు. ఇక్కడి పరిస్థితులు దాదాపు నేపాల్‌తో సమంగా ఉంటాయన్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపాడు.
మ్యాచ్‌కు ముందు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాకిస్థాన్ సింగర్ అయిమా బైగ్, నేపాలి సింగర్ త్రిషలా గురంగ్ తమ పాటలతో సందడి చేశారు. ఏఆర్ రెహ్మాన్ కచేరి ఉంటుందని ప్రచారం జరిగినా అదంతా తప్పుడు సమాచారమని తేలిపోయింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు ఫకార్ జమాన్(14), ఇమామ్ ఉల్ హక్(5) దారుణంగా విఫలమయ్యారు. ఫకార్ జమాన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. ఇమామ్ ఉల్ హక్ రనౌటయ్యాడు. దాంతో పాక్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజామ్(8 బ్యాటింగ్), మహమ్మద్ రిజ్వాన్ ఆచితూచి ఆడుతున్నారు.
తుది జట్లు:
పాకిస్థాన్: బాబర్ ఆజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇప్తికర్ అహ్మద్, మహమ్మద్ రిజ్వాన్(కీపర్), మహమ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిది, హ్యారీస్ రౌఫ్
నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, రోహిత్ పౌడెల్, ఆరిఫ్ షేక్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్సన్ ఝూ, సోంపాల్ కమీ, కరణ్, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి