కరాచీ: ఆసియాకప్ 2023 వన్డే టోర్నీతో పాటు అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇంజుమామ్ ఉల్ హక్ సారథ్యంలోని పాక్ సెలెక్షన్ కమిటీ బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాక్ జట్టు వివరాలను బుధవారం వెల్లడించింది. బాబర్ ఆజామ్‌కు షాదాబ్ ఖాన్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.
పేలవ ఫామ్ నేపథ్యంలో పాక్ స్టార్ బ్యాటర్ షాన్ మసూద్‌పై సెలెక్టర్లు వేటు వేసారు. జట్టులోకి కొత్తగా షహీమ్ అష్రఫ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్‌లను తీసుకున్నారు. ఎమర్జింగ్ ఆసియాకప్‌లో భారత్‌తో జరిగిన ఫైనల్లో సెంచరీతో సత్తా చాటిన తయ్యబ్ తాహిర్‌కు అవకాశం కల్పించారు. గత మూడు నెలలుగా షాన్ మసూద్ ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేకపోవడంతోనే అతనిపై వేటు వేసామని ఇంజుమామ్ ఉల్ హక్ వివరణ ఇచ్చాడు.

'గత 9 మ్యాచ్‌ల్లో షాన్ మసూద్ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. గత మూడు నెలలుగా అతని ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. సౌద్ షకీల్, అబ్దుల్లా షఫీక్ అతని కంటే మెరుగైన ప్రదర్శన చేశారు.'అని ఇంజమామ్ ఉల్ హక్ తెలిపాడు.
శ్రీలంక వేదికగా ఆగస్ట్ 22 నుంచి 26 వరకు అఫ్గానిస్థాన్‌తో పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. అలాగే ఆగస్ట్ 20 నుంచి సెప్టెంబర్ 17 వరకు శ్రీలంక వేదికగానే జరిగే ఆసియాకప్ 2023 టోర్నీలో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్.. ఆగస్ట్ 30న ముల్తాన్ వేదికగా నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 2న పల్లెకెలె మీదుగా భారత్‌తో తలపడనుంది.
పాకిస్థాన్ జట్టు..
బాబర్ ఆజామ్(కెప్టెన్), ఫఖార్ జమాన్, మహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్, అబ్దుల్లా షఫీఖ్, ఫహీమ్ అష్రఫ్, హ్యారీస్ రౌఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమామ్ ఉల్ హక్, మహమ్మద్ హ్యారీస్, మహమ్మద్ వసీమ్ జూనియర్, సౌద్ షకీల్, నసీమ్ షా, అఘా సల్మాన్, షాహిన్ అఫ్రిది, తయ్యబ్ తాహిర్, ఉసామా మీర్, మహమ్మద్ నవాజ్.