కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న ఫైనల్లో మహమ్మద్ సిరాజ్(6/21) నిప్పులు చెరిగాడు. సిరాజ్ సిక్సర్‌కు హార్దిక్ పాండ్యా(3/3) తీన్మార్ వేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ ధాటికి శ్రీలంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు.
కుశాల్ మెండిస్(17), దుషన్ హేమంత(13 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లంక బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రాకు ఓ వికెట్ దక్కింది. పదికి పది వికెట్లు పేసర్లే తీయడం విశేషం.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు జస్‌ప్రీత్ బుమ్రా ఆదిలోనే గట్టి షాకిచ్చాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే కుశాల్ పెరీరా(0)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం సిరాజ్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు.
సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి ఓపెనర్ పాతుమ్ నిస్సంక(2) జడేజా సంచలన క్యాచ్‌తో పెవిలియన్ చేరగా... మూడో బంతికి సమరవిక్రమా ఎల్బీగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. నాలుగో బంతికి గత మ్యాచ్ విన్నర్ చరిత్ అస్సలంక(0) డకౌటయ్యాడు. సిరాజ్ వేసిన ఫుల్ డెలివరీని అసలంక డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా కవర్స్‌లో ఉన్న కిషన్ చేతిలో పడింది.
అనంతరం ధనంజయ డిసిల్వా(4) నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. కానీ మరుసటి బంతికే కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. సిరాజ్ వేసిన ఔట్ స్వింగర్‌ను పుష్ చేసే ప్రయత్నంలో కీపర్‌కు చిక్కాడు. దాంతో ఒకే ఓవర్‌లో సిరాజ్ నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తన మరుసటి ఓవర్‌లో కెప్టెన్ డసన్ షనక(0)ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. అత్యంత వేగంగా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అనంతరం కుశాల్ మెండీస్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ ఆరో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
చివరి మూడు వికెట్లను హార్దిక్ పాండ్యా తీయడంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. వెల్లలాగే(8), ప్రమోద్(1), పతీరణ(0)లను వరుసగా పెవిలియన్ చేర్చాడు.