హైదరాబాద్: ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మిడిలార్డర్‌లో ఆడే బ్యాటర్లు ఎవరా? అనేదానిపై సస్పెన్స్ నెలకొంది. రెగ్యులర్ ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాలతో గత నాలుగు నెలలుగా ఆటకు దూరమయ్యారు. ప్రస్తుతం ఎన్‌సీఏలో ఉన్న ఈ ఇద్దరూ రీఎంట్రీ ఇచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు.
అయితే ఈ ఇద్దరు ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ ఇద్దరు అందుబాటులోకి వస్తే కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. అయితే కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు. అతను ఒత్తిడిని అధిగమించలేడని గుర్తు చేస్తున్నారు.

ఎంతో ప్రతిభ కలిగిన కేఎల్ రాహుల్.. కీలక మ్యాచ్‌ల్లో రాణించలేడని, అతని కారణంగా టీమిండియా మూడు ప్రపంచకప్ టోర్నీలతో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైందని గుర్తు చేస్తున్నారు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడే కేఎల్ రాహుల్ ఒత్తిడిని అధిగమించలేడని చెప్పాడని, అతన్ని ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేయవద్దని కోరుతున్నారు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యారు. చివరకు కోహ్లీ పుణ్యమా అంటూ ఆ మ్యాచ్‌లో గట్టెక్కినా.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో రాహుల్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఈ టోర్నీలోనే కాదు గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ రాహుల్ ఇలానే ఆరంభంలో ఔటై జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.
ఆ మ్యాచ్‌లో షాహిన్ షా అఫ్రిది బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడేళ్ల క్రితం ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ కేఎల్ రాహుల్(1) ఒత్తిడికి చిత్తయ్యాడు. న్యూజిలాండ్ విధించిన 240 పరుగుల లక్ష్యచేధనలో టీమిండియా వరుస రెండు ఓవర్లలో రోహిత్, విరాట్ కోహ్లీ కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన రాహుల్ మూడో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. దాంతో జట్టు మొత్తం తీవ్ర ఒత్తిడిలోపడిపోయింది.
ధోనీ, జడేజా హాఫ్ సెంచరీలతో విజయం కోసం చివరి వరకు పోరాడే ప్రయత్నం చేసినా.. కీలక సమయంలో ఔటవ్వడం భారత జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. పవర్ ప్లే ముగిసేవరకైనా రాహుల్ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేసినా భారత్‌కు కలిసొచ్చేది. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగినా.. మిడిలార్డర్‌లో ఆడినా జట్టుకు ఒరిగేదేం లేదని కామెంట్ చేస్తున్నారు.
వరల్డ్ కప్ టీమ్ ప్రణాళికల నుంచే అతన్ని తీసేసి లెఫ్టాండ్ బ్యాటర్లు అయిన యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. టీమిండియాకు శనిలా దాపురించాడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో జట్టులోకి తీసుకోవద్దని రోహిత్ శర్మకు రిక్వెస్ట్ చేస్తున్నారు.
ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా మినహా మరో లెఫ్టాండర్ లేడని, టాప్-5 బ్యాటర్లలో ఇద్దరూ లెఫ్టాండర్స్ ఉండేలా టీమ్ కాంబినేషన్‌ను సిద్దం చేయాలని రవిశాస్త్రి వంటి దిగ్గజ ఆటగాళ్లు ఇప్పటికే సూచించారు. రాహుల్‌కు బదులు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్‌లను తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.