కొలంబో: పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ నసీమ్ షా గాయంతో ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో గురువారం జరగబోయే కీలక పోరు ముందు నసీమ్ షా సేవలు కోల్పోవడం ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బే. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నసీమ్ షా గాయపడ్డాడు.
అతని భుజ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు అప్‌కమింగ్ వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని నసీమ్ షాకు విశ్రాంతినిచ్చినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. నసీమ్ షా స్థానంలో జమాన్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. జమాన్ ఖాన్ ఇప్పటికే జట్టుతో కలిసిపోయాడని, శ్రీలంకతో మ్యాచ్‌కు సిద్దమవుతున్నాడని పేర్కొంది.

జట్టును వీడిన నసీమ్ షా.. పీసీబీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని, వన్డే ప్రపంచకప్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్‌తో మ్యాచ్‌లో గాయపడిన హ్యారీస్ రౌఫ్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. అతని ఫిట్‌నెస్‌కు సంబంధించి పీసీబీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
భారత్‌తో సూపర్ 4 మ్యాచ్ చివర్లో నసీమ్ షా గాయపడి మైదానాన్ని వీడాడు. బ్యాటింగ్ కూడా చేయలేదు. హ్యారీస్ రౌఫ్ ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ మ్యాచ్‌లో పాక్ 228 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. ఈ టోర్నీలో ఫైనల్ చేరాలంటే శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఖచ్చితంగా గెలవాలి.
ఓడినా.. వర్షం కారణం మ్యాచ్ రద్దయినా శ్రీలంక ఫైనల్ చేరుతోంది. ఇప్పటికే భారత్ ఫైనల్ చేరింది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఫైనల్ చేరాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.