న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్‌తో సూపర్ -4 మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు నెంబర్ వన్ ర్యాంక్ చేజారింది. సౌతాఫ్రికా గడ్డపై వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ఆసీస్ మళ్లీ నెంబర్ వన్ వన్డే జట్టుగా అవతరించింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆసీస్.. పాకిస్థాన్ వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.
సౌతాఫ్రికాతో 5 వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో వన్డే ఆసీస్ 123 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 121 రేటింగ్ పాయింట్స్ సొంతం చేసుకున్న ఆసీస్.. పాకిస్థాన్ 120 రేటింగ్ పాయింట్స్‌ను వెనక్కునెట్టింది. 114 రేటింగ్ పాయింట్స్‌తో భారత్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతోంది.

మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే ఆసియాకప్ సూపర్ 4 మ్యాచ్ ఫలితంతో ఈ ర్యాంకింగ్స్ మళ్లీ తారుమారు కానున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధిస్తే మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్ అందుకోనుంది.
సౌతాఫ్రికాతో రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 392 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేవిడ్ వార్నర్(106), మార్నస్ లబుషేన్(124) విధ్వంసకర సెంచరీలతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(64), జోష్ ఇంగ్లీష్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో షమ్సీ నాలుగు వికెట్లు తీయగా.. రబడా 2, మార్కో జెన్సెన్ ఓ వికెట్ తీసాడు. అనంతరం సౌతాఫ్రికా 41.5 ఓవర్లలో 269 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.