న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న సూపర్-4 మ్యాచ్ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం కొలంబో వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించింది. వర్ష సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
సూపర్-4లో ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌డే కేటాయించింది. ఇరు జట్ల మధ్య పల్లెకెలె వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ మాత్రమే చేయగా.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు.

పసికూన నేపాల్‌పై విజయం సాధించిన ఇరు జట్లు సూపర్-4 అర్హత సాధించాయి. అయితే సూపర్-4 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న కొలంబో నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఆలస్యం కారణంగా గత రెండు వారాలుగా అక్కడ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం జరిగే భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.
వర్షాల నేపథ్యంలో సూపర్-4 మ్యాచ్‌ల వేదికను హంబన్‌టోటకు మార్చాలని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) ప్రతిపాదించినప్పటికీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఒప్పుకోలేదు. ఇంత తక్కువ వ్యవధిలో సామగ్రి, సిబ్బందిని అక్కడికి తరలించడం చాలా కష్టమని అధికారిక బ్రాడ్‌కాస్టర్ చెప్పడమే అందుకు కారణమని తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లోనే భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే సూపర్ 4 మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే కేటాయించారు. సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌కు ఎలాగూ రిజర్వ్ డే ఉంది. కొలంబోలో వర్షాల కారణంగా టీమిండియా ప్రాక్టీస్ ఇండోర్‌కే పరిమితమైంది. గురువారం చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆధ్వర్యంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు.
సతమణి ప్రసవం కోసం స్వదేశానికి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా జట్టుతో చేరాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతను బరిలోకి దిగనున్నాడు. సర్జరీ తర్వాత సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ కూడా భారత జట్టుతో కలిసాడు. రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్దమవుతున్నాడు.