
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా వేదికగా అతని ఫాలోవర్ల సంఖ్యను చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతోంది. శతృదేశం పాకిస్థాన్‌లోనూ విరాట్ కోహ్లీ అంటే పడిచచ్చే అభిమానులు ఉన్నారు. గతంలో అనేక సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. కోహ్లీ కోసం భారత్‌కు సపోర్ట్ చేయడం.. ఇళ్లలో కోహ్లీ ఫొటోలను పెట్టుకోవడం, భారత జెండాలను ఎగురువేయడం వంటి సంఘటనలను చూశాం.
తాజాగా దుబాయ్‌లోనూ అదే తరహా ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ అభిమాని తన ఆరాధ్య క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీతో ఫొటో దిగేందుకు రిస్క్ చేశాడు. ఆసియాకప్ 2022 టోర్నీ కోసం దుబాయ్‌లో సన్నదమవుతున్న కోహ్లీని కలిసేందుకు సెక్యూరిటీ కళ్లుగప్పి భారత నెట్ ప్రాక్టీస్ సెషన్ దగ్గరకు వెళ్లాడు. ఇక సదరు అభిమాని చర్యతో ఉలిక్కపడ్డ భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకొని ఈడ్బుకెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఆ అభిమాని 'నేను పాకిస్థాన్‌కు చెందిన క్రికెట్ అభిమానిని. కోహ్లీతో ఫోటో దిగాలనుకుంటున్నాను'అని గట్టిగా అరిచాడు.
ఇది విన్న విరాట్ కోహ్లీ.. సెక్యూరిటీని వారించి సదరు అభిమానికి సెల్ఫీ ఇచ్చాడు. దాంతో ఆ పాక్ ఫ్యాన్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అనంతరం ఆ అభిమానిని పాకిస్థాన్‌కు చెందిన పాక్‌టీవీ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆ అభిమాని మాట్లాడుతూ.. కోహ్లీని కలుసుకోవడంతో తన జన్మ ధన్యమైందని, ఆ అల్లా దయతో కోహ్లీ ఫామ్‌లోకి రావాలని ఆకాంక్షించాడు.
'విరాట్ కోహ్లీ చాలా గొప్ప వ్యక్తి. నా జీవితంలోనే ఇదో మధురమైన క్షణం. ఈ ప్రపంచంలో నేను అభిమానించేది కోహ్లీ ఒక్కడినే. అతనికి నేను వీరాభిమానిని. కోహ్లీ కోసమే పాకిస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చాను. అతనితో ఫొటో దిగేందుకు గత నెలరోజులుగా వేయిట్ చేస్తున్నాను. అతను చాలా గొప్ప వ్యక్తి. ఎదిగే కొద్ది ఒదిగి ఉండే మనిషి. ఈ ప్రపంచంలోనే కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. నా జీవితాంతం కోహ్లీని కలిసిన క్షణాన్ని గుర్తుంచుకుంటా. ఆ అల్లా దయతో అతను పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నా'అని సదరు అభిమాని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.