
కొలంబో: ఆసియాకప్ 2022 విజేత శ్రీలంక జట్టుకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆసియాకప్ బరిలోకి దిగిన లంక.. అసాధారణ ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. సూపర్4లో తమకంటే బలమైన భారత జట్టును మట్టికరిపించిన లంక..ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ప్రజలకు భారీ ఊరటనిచ్చింది. దాంతో ఒక్కసారిగా ఆ దేశ ప్రజలు అన్ని కష్టాలను మర్చిపోయి.. తమ క్రికెట్ హీరోలకు ఘన స్వాగతం పలికారు.
విజయం వరించిన మరుక్షణమే వీధుల్లో రచ్చచేసిన లంక ప్రజలు.. తమ విజేతలకు ఊహించని స్వాగతాన్ని అందించారు. ఓపెన్ టాప్ బస్‌లో ఆసియా కప్ టైటిల్‌తో లంక క్రికెటర్లు సందడి చేస్తుంటే.. బైక్స్ పై ర్యాలీగా ముందూ.. వెనక.. జాతీయ జెండాలతో అభిమానులు సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొలొంబో ఎయిర్‌పోర్ట్ నుంచి విక్టరీ పరేడ్ నిర్వహించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించగా.. ప్రజలు స్వచ్చందంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇక శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులను, ఆటగాళ్లను లంక ప్రభుత్వ పెద్దలు సత్కరించారు. శక్తి వంచన లేకుండా పోరడి టైటిల్‌ను కైవసం చేసుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏ మాత్రం వారి ఆటపై ప్రభావం చూపకుండా లంక ఆటగాళ్లు చాలా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంలో లంక ఆటగాళ్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్నక్రీడాభిమానులు కొనియాడుతున్నారు. వాస్తవానికి ఈ ఆసియాకప్ శ్రీలంక వేదికగానే జరగాల్సింది. కానీ దేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా టోర్నీని ఇక్కడ నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు చెప్పడంతో యూఏఈకి తరలించారు.