Asia Cup 2022: టాస్ లేదు గీస్ లేదు.. పాకిస్థాన్‌ను పాతరేసిన శ్రీలంక.. ఆసియా విజేత డసన్ సేన!

దుబాయ్: ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆసియా కప్ 2022 బరిలోకి దిగిన శ్రీలంక సంచలన ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకుపోయింది. ఘోర పరాజయంతో టోర్నీని ప్రారంభించిన శ్రీలంక.. నేలకు కొట్టిన బంతిలా పుంజుకుంది. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టి సంచలన విజయాలు నమోదు చేసింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో టాస్ ఓడిపోయినా.. 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డా.. సమష్టిగా పోరాడి చిరస్మరణీయ విజయాన్నందుకుంది. వానిందు హసరంగా(36, 3/27) ఆల్‌రౌండ్ ప్రదర్శనకు భానుక రాజపక్స(45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ తోడవడంతో 23 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది.
రాజపక్స సూపర్ బ్యాటింగ్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. భానుక రాజపక్స అజేయ హాఫ్ సెంచరీకి అండగా హసరంగా(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36)రాణించాడు. ఈ ఇద్దరు 6వ వికెట్‌కు 58 పరుగులు జోడించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ మూడు వికెట్లు తీయగా.. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(49 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 55), ఇఫ్తికర్ అహ్మద్(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32), హరీస్ రౌఫ్(13) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. శ్రీలంక బౌలర్లలో ప్రమోద్ మధుషాన్ నాలుగు వికెట్లు తీయగా.. వానిందు హసరంగా మూడు వికెట్లతో సత్తా చాటాడు. చమికా కరుణరత్నే రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.
ఒక్క బంతికే 10 పరుగులు..
171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఊహించని ఆరంభం దక్కింది. దిల్షాన్ మధుశంకా ఎక్స్‌ట్రాలా రూపంలో ఒక్క బంతికే 10 పరుగులు అందించాడు. అయితే ఈ ఆరంభాన్ని పాక్ అందిపుచ్చుకోలేకపోయింది. ప్రమోద్ మధుషాన్ వేసిన నాలుగో ఓవర్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్(5), ఫకార్ జమాన్(0) వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. బాబర్ క్యాచ్ ఔటవ్వగా.. ఫకార్ జమాన్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ ఆదిలోనే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శ్రీలంక ఆటగాళ్లు రివ్యూ తీసుకోకపోవడంతో అతను బచాయించాడు.
ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు..
ఈ అవకాశాన్ని అందుకున్న ఇఫ్తికర్ అహ్మద్.. రిజ్వాన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం ఇఫ్తికర్ అహ్మద్(32)ను మధుషాన్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మహమ్మద్ నవాజ్(6)ను కరుణరత్నే ఔట్ చేయగా.. రిజ్వాన్ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో హసరంగా బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన రిజ్వాన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ(0), కుష్దిల్ షాలను ఔట్ చేసిన హసరంగా ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు.
తీక్షణ వేసిన 18వ ఓవర్‌లో షాదాబ్ ఖాన్(8) కూడా ఔటవ్వడంతో పాక్ ఓటమి ఖారారైంది. మధుషాన్ వేసిన 19వ ఓవర్‌లో నసీమ్ షా క్యాచ్ ఔటవ్వగా.. ఆఖరి ఓవర్ చివరి బంతికి హరీస్ రౌఫ్ క్లీన్ బౌల్డయ్యాడు. దాంతో శ్రీలంక ఆరోసారి ఆసియాకప్‌ను ముద్దాడింది. సమష్టి ప్రదర్శనతో ఆ జట్టు విజేతగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications