
దుబాయ్: టీమిండియా మేనేజ్‌మెంట్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు జట్టు ఎంపిక కూడా చేతకావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. అసలు భారత తుది జట్టులో ఆడే ఆటగాళ్లపై తుది నిర్ణయం తీసుకోవాలని, భవిష్యత్తులో ఎలాంటి కాంబినేషన్‌ను కొనసాగించాలనుకుంటున్నారనే విషయాన్ని తెలియాజేయాలన్నాడు. జట్టు ఎంపికలో ఇంత గందరగోళమా? అంటూ మండిపడ్డాడు.
ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అక్తర్.. భారత తుది జట్టు ఎంపికను తప్పుబట్టాడు. జట్టు ఎంపిక విషయంలో రోహిత్ సేన ఇంత గందరగోళానికి ఎందుకు గురవుతుందో? అర్థం కావడం లేదన్నాడు.
'ముందుగా భారత్ తమ తుది జట్టులో ఎవరిని ఆడించాలనుకుంటుందో అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలి. భవిష్యత్తు ఆటగాడు ఎవరు? రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్‌లో ఎవరిని కొనసాగించాలనుకుంటున్నారు? ముందుగా తుది జట్టును ఎంపిక చేయండి. ఎందుకంటే భారత తుది జట్టు ఎంపిక గందరగోళంగా ఉంది. అసలు టీమ్‌మేనేజ్‌మెంట్ ఎందుకింత కన్ఫ్యూజ్ అవుతుందో అర్థం కావడం లేదు.'అని తెలిపాడు. సూపర్-4లో పాక్ చేతిలో ఓడిన భారత్.. ఫైనల్ చేరాలంటే తమ తదుపరి మ్యాచ్‌లు శ్రీలంక, అఫ్గానిస్థాన్‌లతో తప్పక గెలవాలి. గెలవడమే కాకుండా మెరుగైన రన్ రేట్ సాధించాలి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 60; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 71) జట్టును ఒడ్డున పడేసే ఇన్నింగ్స్ ఆడాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మహమ్మద్ నవాజ్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించాడు. భారత బౌలర్లలో ఏ ఒక్కరూ ప్రభావవంతమైన బౌలింగ్ చేయలేకపోయారు. నేడు విశ్రాంతి దినం కాగా.. రేపు సూపర్-4 రెండో లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే శ్రీలంకపై భారత్ గెలవాల్సి ఉంటుంది.