
దుబాయ్: నాలుగేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 షెడ్యూల్ వచ్చేసింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీ మ్యాచ్‌ల వివరాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరగనుండగా.. మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆగస్టు 28(ఆదివారం) ఆడనుంది. రెండో మ్యాచ్‌ను క్వాలిఫయర్ జట్టుతో 31న ఆడనుంది. సెప్టెంబర్ 3న సూపర్ 4 మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా.. ఫైనల్ సెప్టెంబర్ 11న దుబాయ్ వేదికగా జరగనుంది.
మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ జట్లు ఇదివరకే అర్హత సాధించగా.. ఆరో బెర్త్ కోసం హాంకాంగ్, సింగపూర్, కువైట్, యూఏఈలు క్వాలిఫికేషన్ రౌండ్‌లో తలపడనున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాల్సి ఉండగా అక్కడ నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎడారి దేశం అయిన యూఏఈకి తరలించారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు మినీ వరల్డ్‌కప్‌గా సాగనున్న ఈ టోర్నీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
2016తో పాటు 2018లో కూడా భారత జట్టే ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇక ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టు కూడా టీమిండియానే కావడం గమనార్హం. 1984 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా.. ఇప్పటివరకు భారత జట్టు ఏడుసార్లు ట్రోఫీ నెగ్గింది. శ్రీలంక ఐదుసార్లు గెలుపొందగా పాకిస్తాన్ రెండు సార్లు విజేతగా నిలిచింది. మరి ఈసారి విజేత ఎవరవుతారని ఆసియా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.