IND vs PAK: టీమిండియా కొంపముంచిన రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ.. ముఖ్యంగా ఆ మూడు తప్పిదాలు..!

హైదరాబాద్: ఆసియాకప్ 2022లో టీమిండియా జైత్రయాత్రకు పాకిస్థాన్ బ్రేక్ వేసింది. ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్ల మధ్య ఊగిసలాడింది. కానీ చివరకు పాకిస్థాన్‌నే వరించింది. అయితే సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. కీలక సమయంలో అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ నేలపాలు చేయడం మ్యాచ్‌ను మలుపుతిప్పగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీ తీరు కూడా ఓటమికి బాటలు వేసింది.
టీ20 ఫార్మాట్‌లో ది బెస్ట్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ.. ఆదివారం మ్యాచ్‌లో కొన్ని తప్పిదాలు చేశాడు. తనదైన సారథ్యంతో మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ చేసిన మూడు తప్పిదాలు భారత పరాజయానికి కారణమయ్యాయి.

1. దీపక్ హుడాకు బౌలింగ్ ఇవ్వకపోవడం..
ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా జట్టులోకి తీసుకున్న దీపక్ హుడాకు రోహిత్ శర్మ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది. హుడాకు కనీసం రెండు ఓవర్లు ఇచ్చినా పరిస్థితి మరోలా ఉండేదేమోననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గాయంతో రవీంద్ర జడేజా దూరమైన నేపథ్యంలో హుడాను జట్టులోకి తీసుకున్నారు. దీపక్ హుడా బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడనే అతనికి అవకాశం ఇచ్చారు.
దాంతో దీపక్ హుడా ఎంపిక సరైనదని మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసించారు. కానీ.. తీరా మ్యాచ్‌లో దీపక్ హుడాతో కనీసం ఒక్క ఓవర్‌ని కూడా రోహిత్ శర్మ బౌలింగ్ చేయించలేదు. ముఖ్యంగా లెఫ్టాండర్ మహమ్మద్ నవాజ్‌ను ఔట్ చేసేందుకు ఆఫ్ స్పిన్నర్ అయిన దీపక్ హుడాతో బౌలింగ్ చేయించాల్సింది.

2. హార్దిక్ పాండ్యా అతి నమ్మకం..
పాకిస్థాన్‌తో ఫస్ట్ మ్యాచ్‌లో మ్యాచ్ విన్నర్‌గా నిలిచిన హార్దిక్ పాండ్యాపై రోహిత్ శర్మ నమ్మకం ఉంచడం చేటు చేసింది. బ్యాటింగ్‌లో విఫలమైన హార్దిక్ పాండ్యా.. బౌలింగ్‌లోనూ చేతులెత్తేసాడు. 182 పరుగుల ఛేదనలో పాకిస్థాన్ టీమ్ తొలి 10 ఓవర్లలో అంత దూకుడుగా ఏమీ ఆడలేదు. అయినప్పటికీ దీపక్ హుడాతో రోహిత్ శర్మ బౌలింగ్ చేయించే సాహసం చేయలేదు. పాకిస్థాన్ బ్యాటర్లు ఇప్పటి వరకూ దీపక్ హుడా బౌలింగ్‌లో ఆడింది లేదు. దాంతో.. ఒకవేళ అతనితో ఓ 2 ఓవర్లు బౌలింగ్ చేయించి ఉంటే ప్రయోజనం ఉండేది.మరోవైపు హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులిచ్చేస్తున్నా మొండిగా అతనినే కంటిన్యూ చేయించాడు. ఓవరాల్‌గా దీపక్ హుడా రూపంలో సిక్త్స్ బౌలింగ్ ఆప్షన్ అందుబాటులో ఉన్నా.. రోహిత్ శర్మ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై నమ్మకం ఉంచి నట్టేట మునిగాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

3.భువీతో 19వ ఓవర్ వేయించడం..
19వ ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్‌తో కాకుండా భువనేశ్వర్ కుమార్‌తో వేయించడం జట్టుకు నష్టం చేసింది. చివరి 12 బంతుల్లో 26 పరుగులు అవసరమవ్వగా... భువీ ఒక్కడే 19 పరుగులిచ్చి పాక్ పని సులువు చేశాడు. ఇక చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ రెండో బంతికే బౌండరీ ఇచ్చినా.. రోహిత్ తన ట్రేడ్ మార్క్ కెప్టెన్సీతో మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాడు. ఫీల్డర్లందరిని సర్కిల్ లోపు పెట్టి బౌలింగ్ చేయించి సైకలాజికల్‌గా పాక్ బ్యాటర్లను ఒత్తిడికి గురి చేశాడు. దాంతో అర్ష్‌దీప్ సూపర్ యార్కర్లతో రెండు బంతులను డాట్ చేయడంతో పాటు ఓ వికెట్ తీసాడు. చివరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరమవ్వగా... క్విక్ డబుల్‌తో పాక్ గెలిచింది. అయితే 19వ ఓవర్ అర్షదీప్ సింగ్ ఇచ్చుంటే అతను డిఫెండ్ చేసేవాడని, చివరి ఓవర్‌లో పాక్ బ్యాటర్లకు ఒత్తిడికి గురయ్యేవారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications