
దుబాయ్: ఆసియాకప్ 2022 వైఫల్యంపై దిగులు చెందాల్సిన అవసరం ఏ మాత్రం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. శ్రీలంకతో మంగళవారంజరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయం అనంతర మీడియా సమావేశం పాల్గొన్న రోహిత్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత చాలా మ్యాచ్‌లు ఆడి గెలిచామని, కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఓడామని దిగులుపడాల్సిన అవసరం లేదన్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో కూడా చివరి వరకు పోరాడమనే విషయాన్ని గ్రహించాలన్నాడు. అప్ కమింగ్ టీ20 ప్రపంచకప్ కోసం తుది జట్టు ఎంపికపై తాము కసరత్తులు చేస్తున్నామని.. ఇప్పటికే 95 శాతం జట్టు సిద్ధమైందని అన్నాడు. అనంతరం ఆసియాకప్ వైఫల్యాలపై జర్నలిస్టులు అడిన ప్రశ్నలకు రోహిత్ సమాధానాలిచ్చాడు.
ఈ క్రమంలోనే దినేశ్ కార్తీక్‌ను ఆడించకపోవడంపై స్పందించిన రోహిత్.. తప్పని పరిస్థితుల్లో కార్తీక్‌ను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు. 'మేం మిడిలార్డర్‌లో లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలనుకున్నాం. అందుకే కార్తీక్ ను పక్కనబెట్టి రిషభ్ పంత్‌ను ఆడించాం. అంతేగానీ కార్తీక్ ఫామ్ గురించో మరొకటో కాదు.. కానీ మా వ్యూహం పలించలేదు.' అని తెలిపాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో కార్తీక్ ఆడగా.. అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో కార్తీక్ స్థానంలో ఆడిన పంత్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో కార్తీక్ విలువ ఏంటో జట్టుకు తెలుసొచ్చింది.
ఇక దీపక్ హుడాకు బౌలింగ్ ఇవ్వకపోవడంపై కూడా రోహిత్ వివరణ ఇచ్చాడు. 'మాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉంది. కానీ ఐదుగురు బౌలర్లతో ఆడితే ఏమవుతుంది..? ఏం కాదు..? అని మేం ప్రయత్నించాలనుకున్నాం. లంకతో మ్యాచ్‌లో అప్పటికే ఇద్దరు ఓపెనర్లు (రైట్ హ్యాండర్స్) కుదురుకున్నారు. ఆ సమయంలో అటాకింగ్ స్పిన్ వేసే చాహల్, అశ్విన్‌కు బంతినిస్తే ఉత్తమమని అనిపించింది. ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా నా మనసులో హుడా కూడా ఉన్నాడు. మేం త్వరగా వికెట్లు తీసుంటే నేను కూడా హుడాతో బౌలింగ్ చేద్దామనుకున్నా. కానీ అలా జరగలేదు.. ప్రపంచకప్‌లో ఆడేప్పుడు ఇది మాకు ఒక గుణపాఠంగా పనికొస్తుంది.'అని వివరించాడు.
ఒకటి, రెండు మార్పులు మినహా టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు సిద్దమైందని రోహిత్ తెలిపాడు. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి చేరడంతో తాము ముగ్గురు సీమర్లతో ఆడామని, ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడితే ఏమౌంతుందనేది ఈ రెండు ఓటముల ద్వారా తమకు తెలిసొచ్చిందన్నాడు. రానున్న రెండు సిరీస్‌ల తర్వాత ప్రపంచకప్‌లో ఏ కాంబినేషన్‌తో ఆడాలనేదానిపై తాము తుది నిర్ణయానికి వస్తామని చెప్పాడు.