Asia Cup 2022: భారత్, పాకిస్థాన్ జట్లకు భారీ షాక్..!

దుబాయ్: ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఇరు జట్లు స్లో ఓవర్ రేట్‌కు కారణమయ్యాయి. నిర్ణీత సమయంలోపు తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. దాంతో ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతో ఆటను కొనసాగించాయి. ఇది ఇరు జట్లను తీవ్రంగా నష్టపరిచింది.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ సందర్భంగా భారత్ చివరి రెండు ఓవర్లను ఆలస్యంగా వేసి మూల్యం చెల్లించుకుంది. నలుగురు ఫీల్లర్లు మాత్రమే సర్కిల్ బయట ఉండటంతో పాకిస్థాన్ టేయిలెండర్ షానవజ్ దహాని ధాటిగా ఆడాడు. 130 పరుగులకే పరిమితమయ్యే జట్టు స్కోర్‌ను 147 వరకు తీసుకెళ్లాడు. ఇక భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్థాన్ మూడు ఓవర్లను ఆలస్యంగా వేసి మూల్యం చెల్లించుకుంది. ఫీల్డింగ్ బయట నలుగురు ఫీల్డర్లే ఉండటంతో జడేజా, హార్దిక్ పాండ్యా ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌండరీలు రాబట్టి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22లో పేర్కొన్న ప్రకారం ఒక మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా జరిగితే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేట్ ఫైన్‌తోపాటు మ్యాచ్‌లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు మాత్రమే ఫీల్డింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. గతేడాదే ఈ కొత్త నిబంధనను ప్రవేశ పెట్టారు.
స్లో ఓవర్ రేట్‌కు కారణమైన ఇరు జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. ఇరు జట్ల ఆటగాళ్లలోని మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. ఇరు జట్లు నిర్ణీత సమయంలో తమ ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమయ్యావని పేర్కొన్న ఐసీసీ.. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ ముందు తమ తప్పును అంగీకరించారని ప్రకటించింది. దాయాదుల పోరు అంటేనే హైఓల్టేజ్‌తో కూడిన సమరం. దాంతో కెప్టెన్లు వ్యూహాలు రచించేందుకు టైమ్ తీసుకుంటారు. ఈ క్రమంలోనే రోహిత్, బాబర్ సైతం తప్పిదం చేశారు. ఇక వచ్చే ఆదివారం కూడా ఇరు జట్లు తలపడే అవకాశం ఉంది. అప్పుడైనా స్లో ఓవర్ రేట్ లేకుండా మ్యాచ్ ముగిస్తారా? లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications