Asia Cup 2022: భారత్ X పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్.. అభిమానులను కలవరపెడుతున్న హార్దిక్ పాండ్యా రికార్డ్స్!

హైదరాబాద్: ఫైనల్లో ఓడినా పెద్దగా పట్టించుకోం.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతిలో చిత్తయినా చింతలేదు. కానీ పొరుగు దేశం పాకిస్థాన్ చేతిలో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేం.! గెలిస్తే.. విశ్వాన్ని జయించినంతగా సంబురపడతాం. ఓడితే ఆగ్రహంతో కారు చీకట్ల కమ్ముకుంటాయి. కోట్లాది హృదయాలు మూగబోతాయి. లక్షలాది గుండెలు భగ్గుమంటాయి. హీరోలు.. జీరోలు అవుతారు. పూల వర్షం పడిన చోట.. రాళ్ల వర్షం కురుస్తుంది. ఎవరూ ఊహించని, మరెవరూ ఆలోచించలేని మహాద్భుత ఘట్టాలు.. హై వోల్టేజ్ ఉత్కంఠలు.. ఊపిరి బిగపట్టే క్షణాలు.. ఉప్పొంగే నరాలకు.. వేదిక కానున్న భారత్, పాకిస్థాన్ ఆసియాకప్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. మరో నాలుగో రోజుల్లో(ఆగస్టు 28) ఈ ఉత్కంఠ పోరుకు తెరలేవనుంది.

2018 ఆసియాకప్‌లో గాయం..
అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా అభిమానులు ఓ విషయం తీవ్రంగా కలవరపెడుతోంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎలా రాణిస్తాడా? అనేదానిపై అందరిలో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఆసియాకప్ జరిగే యూఏఈలో పాండ్యాకు సరైన రికార్డు లేదు. రికార్డేకాదు.. ఈ వేదిక అసలు హార్దిక్‌కు ఏ మాత్రం కలిసిరాలేదు.
తొలుత అతను గాయపడి జట్టుకు దూరమైంది ఇక్కడే. 2018 ఆసియాకప్‌లో హార్దిక్ పాండ్యా ఇదే పాకిస్థాన్‌తో వెన్నుగాయంతో జట్టుకు దూరమయ్యాడు. యూఏఈ వేదికగా జరిగిన ఈ టోర్నీ హార్దిక్ ఒక్క మ్యాచే ఆడిన హార్దిక్.. బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఈ టోర్నీ ఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది.

ఐపీఎల్ 2020 సీజన్‌లో అట్టర్ ఫ్లాఫ్..
కరోనా వైరస్ కారణంగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్ తరఫున 14 మ్యాచ్‌లు ఆడిన అతను.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 35.12 సగటుతో 281 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్‌లో వెన్ను గాయం కారణంగా ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. 2021 సెకండాఫ్ యూఏలో జరగ్గా.. మరోసారి హార్దిక్ విఫలమయ్యాడు. ఈ సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ 14.11 సగటుతో 127 రన్స్ మాత్రమే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.

టీ20 ప్రపంచకప్‌లోనూ..
దుబాయ్ వేదికగానే గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో..(11, 23, 35 నాటౌట్) 69 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ పెద్దగా చేయని హార్దిక్ వికెట్లు కూడా తీయలేదు. హార్దిక్ వైఫల్యం టీమ్ ఘోరపరాజయానికి కారణమైంది. అయితే ఈ టోర్నీ అనంతరం లాంగ్ బ్రేక్ తీసుకున్న హార్దిక్ ఫుల్ ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్ 2022లో సత్తా చాటాడు. తద్వారా భారత జట్టులోకి వచ్చి అద్భుత ప్రదర్శన కనబర్చాడు.

సూపర్ ఫామ్‌లో హార్దిక్..
టీ20 ప్రపంచకప్ అనంతరం ఇప్పటి వరకు 13 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన హార్దిక్ 35.11 సగటుతో 316 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. బౌలింగ్‌లో 8.73 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 4/33గా ఉంది. అయితే ఈ జోరును ఆసియాకప్‌లోనూ కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తనకు ఏ మాత్రం అచ్చిరాని యూఏఈ గడ్డపై హార్దిక్ చెలరేగుతాడో? లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications