
దుబాయ్: ఆసియాకప్ 2022 ఫైనల్‌కు ముందు శ్రీలంకతో ప్రీ ఫైనల్‌గా జరిగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. అయితే పేలవ బ్యాటింగ్ కారణంగానే తాము ఈ మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అంగీకరించాడు. బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చినా.. స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్‌లో రాణించలేకపోయామని చెప్పాడు. ఫైనల్‌కు ముందు ఎదురైన ఈ ఓటమి తమకు ఓ గుణపాఠమని పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బాబర్ ఆజామ్.. లోపాలను సరిదిద్దుకొని టైటిల్ ఫైట్‌కు సిద్దమవుతామని చెప్పాడు.
'గత రెండు మ్యాచ్‌ల్లో మేం అద్భుతంగానే ఆడాం. అయితే బ్యాటింగ్ విభాగంలో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. కానీ మా బౌలర్లు అదరగొట్టారు. మరోసారి పేస్ బౌలర్లకు పాకిస్థాన్ అడ్డా అనే విషయాన్ని చాటిచెప్పారు. హసన్ అలీ కమ్‌బ్యాక్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. ఈ మ్యాచ్ ఫలితంపై కూర్చొని విశ్లేషించుకుంటాం. ఎక్కడ తప్పిదాలు జరిగాయో తెలుసుకొని వాటిని మెరుగుపరుచుకుంటాం. ఆదివారం జరిగే మెగా ఫైనల్‌కు బలంగా బరిలోకి దిగుతాం'అని చెప్పాు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. శ్రీలం బౌలర్లలో స్పిన్నర్ వానిందు హసరంగా (3/21) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. ఇతర బౌలర్లలో మహీశ్ తీక్షణ(2/21), ప్రమోద్ మదుషన్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు. లంక బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(29 బంతుల్లో 2 ఫోర్లతో 30), మహమ్మద్ నవాజ్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 26) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ముగ్గురు బ్యాటర్లు కనీసం ఖాతా కూడా తెరవలేదు.
122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 17 ఓవర్లలోనే 5 వికెట్లకు 124 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. కుశాల్ మెండిస్(0), గుణతిలక(0) విఫలమైనా.. భానుక రాజపక్స(24), డసన్ షనక(21) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో మమమ్మద్ హస్‌నైన్, హ్యారీస్ రౌఫ్ రెండేసి వికెట్లు తీయగా.. ఉస్మాన్ ఖదీర్ తలో వికెట్ తీసారు.