
న్యూఢిల్లీ: టీ20 ఫార్మాట్‌లో టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం జట్టు ఎంపికలోనే లోపాలేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. టీమ్ ఎంపిక సరిగ్గా లేకపోవడంతోనే గతేడాది టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశకే పరిమితమైన టీమిండియా.. ఆసియా కప్‌లోనూ సూపర్-4 స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిందన్నాడు. అంతే తప్పా నాయకత్వ లోపం ఎక్కడా కనిపించలేదన్నాడు.
ఆసియా సూపర్-4లో శ్రీలంక, పాకిస్థాన్ చేతిలో పరాభవం పొందిన భారత్.. అఫ్గాన్ మీద మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ సారథ్యం, జట్టు ఎంపికపై విమర్శలు వచ్చాయి. మైదానంలో రోహిత్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడని సోషల్ మీడియాలో కామెంట్లు హల్‌చల్ సృష్టించాయి.
ఈ క్రమంలోనే టీమిండియా వైఫల్యంపై ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడాడు. 'గతేడాది మనం ఓడినప్పుడు చాలా మంది విరాట్ కోహ్లీ నాయకత్వం గురించి మాట్లాడారు. కెప్టెన్సీని మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో ఆసియా కప్‌లో ఇంటిముఖం పట్టింది. దీంతో రోహిత్ నాయకత్వంపైనా విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ కెప్టెన్సీ సమస్య ఏమీ లేదని నా అభిప్రాయం. జట్టు ఎంపికలో లోపాల వల్లే టీ20ల్లో భారత్ ఓడిపోతోంది. గత టీ20 ప్రపంచకప్ నుంచి చాలామంది ఓపెనర్లను టీమిండియా పరీక్షించింది.
ప్రణాళిక లేకపోవడంతోనే ఆసియా కప్‌లో ఫలితాలు ఇలా వచ్చాయి. ప్రతి మ్యాచ్‌లోనూ మనం చాలా మార్పులు చేశాం. కానీ పాకిస్థాన్, లంక వంటి జట్లు కేవలం ఒకే ఒక ఛేంజ్‌తో బరిలోకి దిగాయి. అందుకే జట్టు ఎంపికపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది'' అని ఆకాశ్ చోప్రా వివరించాడు. అక్టోబర్ 16 నుంచి ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈలోపు భారత్ ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లతో స్వదేశంలో టీ20ల సిరీస్‌లను ఆడనుంది.